భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మంగళవారం(డిసెంబర్ 9) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సఫారీలతో వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఇప్పుడు టీ20ల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. తొలి టీ20కు ముందు బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల క్లబ్‌లో చేరేందుకు బుమ్రా ఒకే ఒక వికెట్ దూరంలో ఉన్నాడు.
అరుదైన రికార్డుపై కన్ను..
కటక్ టీ20లో బుమ్రా వికెట్ సాధిస్తే వంద వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా మూడు ఫార్మాట్లలోనూ ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టిస్తాడు. ఈ పేస్ గుర్రం ఇప్పటికే వన్డే, టెస్టు ఫార్మాట్లలలో వంద వికెట్లను పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో ఇప్పటివరకు 80 మ్యాచ్‌లు ఆడి 99 వికెట్లు సాధించాడు.
అయితే భారత తరపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అర్ష్‌దీప్ సింగ్ 105 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో అర్ష్‌దీప్‌ను కూడా బుమ్రా అధిగమించే అవకాశముంది. అదేవిధంగా అన్ని ఫార్మాట్‌లలో కలిపి 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి బుమ్రాకు 18 వికెట్లు మాత్రమే అవసరం. బుమ్రా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 221 మ్యాచ్‌లు ఆడి 482 వికెట్లు సాధించాడు.
సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..!


