
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఫిల్ సాల్ట్ (Phil Salt) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లోనే.. అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా నిలిచాడు.
సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా ఫిల్ సాల్ట్ ఈ ఘనత సాధించాడు. కాగా ఇంగ్లండ్ స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో ప్రొటిస్ చేతిలో ఓడిన ఇంగ్లిష్ జట్టు.. శుక్రవారం నాటి రెండో టీ20లో మాత్రం అదరగొట్టింది.
ధనాధన్.. ఫటాఫట్.. 60 బంతుల్లోనే..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 304 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను 158 పరుగులకే ఆలౌట్ చేసి.. 146 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది.
ఈ విజయంలో ఫిల్ సాల్ట్‌ది కీలక పాత్ర. ఈ ఓపెనింగ్ బ్యాటర్ మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 141 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో పదిహేను ఫోర్లతో పాటు ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. కాగా ఇంగ్లండ్ తరఫున టీ20లలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతేకాదు సాల్ట్‌కు ఇది అంతర్జాతీయ స్థాయిలో నాలుగో శతకం.
ఈ క్రమంలోనే ఫిల్ సాల్ట్.. సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. కేవలం 42 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లోనే నాలుగు శతకాలు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా చరిత్రపుటల్లోకి ఎక్కాడు. అంతకు ముందు సూర్య 57 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ అందుకున్నాడు.
అంతర్జాతీయ టీ20లలో అత్యంత వేగంగా నాలుగు శతకాలు పూర్తి చేసుకున్న క్రికెటర్లు
🏏ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్)- 42 ఇన్నింగ్స్‌లో
🏏సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 57 ఇన్నింగ్స్‌లో
🏏రోహిత్ శర్మ (ఇండియా)- 79 ఇన్నింగ్స్‌లో
🏏గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా)- 82 ఇన్నింగ్స్‌లో.
ఇక ఈ రికార్డుతో పాటు మరో వరల్డ్ రికార్డును కూడా ఫిల్ సాల్ట్ సమం చేశాడు. సౌతాఫ్రికాపై ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ సాధించిన ఆటగాడిగా జొనాథర్ చార్లెస్‌తో కలిసి ప్రథమ స్థానంలో నిలిచాడు.
సౌతాఫ్రికాపై ఫాస్టెస్ట్ టీ20 సెంచరీలు చేసింది వీరే
🏏ఫిల్ సాల్ట్- 39 బంతుల్లో
🏏జొనాథన్ చార్లెస్- 39 బంతుల్లో
🏏తిలక్ వర్మ- 41 బంతుల్లో
🏏సంజూ శాంసన్- 47 బంతుల్లో
🏏బాబర్ ఆజం- 49 బంతుల్లో.
చదవండి: టీమిండియాలో నో ఛాన్స్.. ఆ కసి అక్కడ చూపించేశాడు! 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో