
భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య నాలుగో టెస్టు నేపథ్యంలో వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే (Ajinkya Rahane) టీమిండియా యాజమాన్యానికి కీలక సూచన చేశాడు. ఒకవేళ ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మాంచెస్టర్ టెస్టు ఆడకుంటే.. అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy) ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
బుమ్రా ఆడతాడా? లేదా?
ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే మూడు పూర్తికాగా.. ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టులో గెలిస్తేనే భారత్‌కు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ దృష్ట్యా బుమ్రా ఆడతాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అర్ష్‌దీప్‌నే ఎందుకంటే..
ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే స్పందిస్తూ.. ‘‘ఒకవేళ బుమ్రా ఆడకపోతే.. అతడి స్థానంలో అర్ష్‌దీప్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలి. ఎందుకంటే.. ఇంగ్లండ్‌లో బంతిని రెండువైపులా స్వింగ్ చేయగల లెఫ్టార్మ్ సీమర్ అవసరం ఎంతగానో ఉంటుంది. ఇందుకు అర్ష్‌దీప్ సరైనోడు.
కుల్దీప్‌నూ ఆడించాలి
అతడి బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుంది. అందుకే బుమ్రా లేకుంటే అర్ష్‌దీప్‌నే కచ్చితంగా ఆడించాలి. అయితే, వికెట్ స్వభావాన్ని బట్టి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కూడా ఆడిస్తే బాగుంటుంది. గత మూడు టెస్టుల మాదిరే పిచ్ ఉన్నట్లయితే.. ఈసారి తప్పకుండా అతడిని ఆడించాలి.
ప్రతిసారీ ఫాస్ట్‌బౌలర్లపైనే ఆధారపడటం సరికాదు. వికెట్లు తీయగల కుల్దీప్ వంటి వారికి అవకాశం ఇవ్వాలి. ఏదేమైనా మన బ్యాటింగ్ విభాగం మెరుగ్గానే రాణిస్తోంది. చేయాల్సిన దాని కంటే 25 -30 పరుగులు తక్కువ స్కోరు చేస్తున్నారేమో గానీ.. మరేం పర్లేదు’’ అంటూ యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఇప్పటికి టీ20, వన్డేలలో మాత్రమే
కాగా టీమిండియా తరఫున టీ20, వన్డేల్లో రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్ టెస్టుల్లో ఇంత వరకు అరంగేట్రం చేయలేదు. 2022లో అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టిన అర్ష్‌దీప్.. ఇప్పటికి 63 టీ20లలో కలిపి 99 వికెట్లు, 9 వన్డేల్లో 14 వికెట్లు కూల్చాడు.
ఇదిలా ఉంటే.. భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23-27)కు మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం వేదిక. అయితే, ఇక్కడ టీమిండియాకు దారుణమైన రికార్డు ఉంది. ఆడిన తొమ్మిది టెస్టుల్లో ఒక్కటి కూడా గెలవలేదు. ఇంగ్లండ్ చేతిలో నాలుగింట ఓడిన టీమిండియా.. ఐదు టెస్టులను డ్రా చేసుకోగలిగింది.
చదవండి: WCL 2025: హఫీజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన పాకిస్తాన్