
లార్డ్స్ టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రెండో బంతిని అందుకునే క్రమంలో పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. బంతిని అందుకున్న తర్వాత పంత్ తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు.
ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినా అతడి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో పంత్ మైదానాన్ని వీడాడు. అతడి స్ధానంలో సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్‌గా దృవ్ జురెల్ మైదానంలోకి వచ్చాడు. పంత్ గాయంపై బీసీసీఐ ప్రకటన చేసింది. అయితే అందులో గాయం తీవ్రత, మ్యాచ్‌లో పంత్ కొనసాగింపుపై ఎలాంటి సమాచారం లేదు.
రెండో రోజు ఆట ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్నప్పటికీ పంత్ గాయంపై సందిగ్దత వీడలేదు. ఈ నేపథ్యంలో పంత్ మ్యాచ్‌లో కొనసాగుతాడా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ పంత్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైతే టీమిండియాకు అది భారీ ఎదురుదెబ్బ అవుతుంది.
ఎందుకంటే ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ మొదలయ్యాక గాయపడిన ఆటగాడికి ప్రత్యామ్నాయంగా ఫీల్డింగ్ లేదా వికెట్‌కీపింగ్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ చేయడానికి వీలు ఉండదు.
ఈ లెక్కన పంత్ మైదానంలోని తిరిగి రాకపోతే భారత్ 10 మందితోనే బ్యాటింగ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. భీకర ఫామ్‌లో ఉన్న పంత్ బ్యాటింగ్‌కు అందుబాటులో ఉండకపోతే టీమిండియా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ సిరీస్‌లో పంత్ కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సహా ఇప్పటివరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 342 పరుగులు చేసి గిల్ తర్వాత ఈ సిరీస్‌లో సెకెండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇలాంటి ఫామ్‌లో ఉన్న పంత్ బ్యాటింగ్‌కు దిగకపోతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. పంత్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన జురెల్ జడేజా బౌలింగ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
కాగా, ఈ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ విజయం సాధించింది.