
మేజర్ లీగ్ క్రికెట్-2025 లీగ్ స్టేజీని టెక్సాస్ సూపర్ కింగ్స్ అద్బుతమైన విజయంతో ముగించింది. ఆదివారం ఫ్లోరిడా వేదికగా సియాటెల్ ఓర్కాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ జయభేరి మ్రోగించింది.
ఈ విజయంతో టెక్సాస్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్దానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(52 బంతుల్లో 6 ఫోర్లు,4 సిక్స్‌లతో 91), శుభమ్ రంజనె (41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
అనంతరం లక్ష్య ఛేదనలో సియాటెల్ 18.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. కేల్ మయేర్స్ (35), షిమ్రోన్ హెట్‌మయెర్ (26), సికందర్ రజా (23) రాణించినా.. మిగితా ప్లేయర్లు విఫలం కావడంతో ఓర్కాస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
టెక్సాస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే 5 వికెట్లు పడగొట్టి సియాటెల్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నూర్ అహ్మద్ 2, అకీల్ హోసేన్ 2, మార్కస్ స్టాయినిస్ ఒక వికెట్ తీశారు. ఇక ఈ ఓటమితో సియాటెల్((6 పాయింట్లు) ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి.
ఇప్పటికే టెక్సాస్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్లు తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాయి. మిగిలిన నాలుగో స్ధానం కోసం ఎంఐ న్యూయర్క్, సియాటెల్ పోటీలో ఉన్నాయి. న్యూయార్క్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో (వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో పోరు) ఘోర ఓటమిపాలైతేనే సియాటెల్‌కు నాలుగో బెర్తు దక్కే అవకాశం ఉంది. ఇది జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి.