‘రంజీ’ సమరానికి వేళాయె! | Domestic first class cricket tournament from today | Sakshi
Sakshi News home page

‘రంజీ’ సమరానికి వేళాయె!

Oct 11 2024 2:53 AM | Updated on Oct 11 2024 2:53 AM

Domestic first class cricket tournament from today

నేటి నుంచి దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌

టైటిల్‌ బరిలో 32 జట్లు 

ఈసారీ దూరంగా ఉండనున్న పలువురు భారత స్టార్స్‌

గ్రూప్‌ ‘బి’లో ఆంధ్ర, హైదరాబాద్‌   

న్యూఢిల్లీ: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీకి వేళైంది. నేటి నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో 32 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడుతున్నాయి. టెస్టు సీజన్‌ కారణంగా భారత జట్టు ప్రధాన ఆటగాళ్లు రంజీ ట్రోఫీకి అందుబాటులో లేకపోగా... వర్ధమాన ఆటగాళ్లు కూడా వివిధ సిరీస్‌ల వల్ల సీజన్‌లో అన్నీ మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదు. దీంతో సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు కొత్తవాళ్లకు ఇదే సరైన అవకాశం. 

జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందే అని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో... స్టార్‌ ప్లేయర్లు తప్ప మిగిలిన వాళ్లంతా వీలున్న సమయంలో ఈ టోర్నీలో పాల్గొననున్నారు. దేశవాళీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే కారణంతో శ్రేయస్‌ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌పై బోర్డు క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నేపథ్యంలో... యువ ఆటగాళ్లు అందరూ రంజీ ట్రోఫీ ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 

హైదరాబాద్, ఆంధ్ర జట్లు గ్రూప్‌ ‘బి’ నుంచి బరిలోకి దిగుతున్నాయి. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపిస్తే చాలు జాతీయ జట్టుకు ఎంపికవొచ్చు అనే ఆలోచన ఆటగాళ్లకు రాకుండా... దేశవాళీల్లో రాణిస్తేనే టీమిండియా తలుపులు తెరుచుకుంటాయి అని బోర్డు సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ప్లేయర్లు తమ శక్తియుక్తులను వాడేందుకు సిద్ధమయ్యారు.

 రంజీ సీజన్‌లోనే భారత జట్టు న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టులు, ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో అసాధారణ ప్రదర్శన కనబరిస్తే టీమిండియా గడప తొక్కొచ్చు అనే ఆలోచన కూడా ప్లేయర్ల మదిలో ఉంది.  

హైదరాబాద్‌ ఆకట్టుకునేనా? 
గత ఏడాది బలహీన జట్లున్న ప్లేట్‌ గ్రూప్‌లో అదరగొట్టి ఎలైట్‌ డివిజన్‌కు అర్హత సాధించిన హైదరాబాద్‌ జట్టు పటిష్ట జట్లతో పోటీపడనుంది. టీమిండియా ఆటగాడు ఠాకూర్‌ తిలక్‌ వర్మ సారథిగా వ్యవహరించనున్నాడు. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో నేడు ప్రారంభం కానున్న మ్యాచ్‌లో గుజరాత్‌తో హైదరాబాద్‌ తలపడనుంది. మరోవైపు నాగ్‌పూర్‌ వేదికగా విదర్భతో ఆంధ్ర జట్టు ఆడుతుంది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరగనున్న ఈ టోర్నీలో ప్రతి గ్రూప్‌లోని ఎనిమిది జట్లు... తక్కిన జట్లతో ఆడనున్నాయి. 

లీగ్‌ దశ ముగిశాక నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఎనిమిది జట్లు నాకౌట్‌ దశ (క్వార్టర్‌ ఫైనల్స్‌)కు అర్హత పొందుతాయి. నేడు ప్రారంభం కానున్న లీగ్‌దశలో తొలి ఐదు లీగ్‌ మ్యాచ్‌లు నవంబర్‌ 16తో ముగుస్తాయి. ఆ తర్వాత రెండు నెలల విరామం తర్వాత చివరి రెండు లీగ్‌ మ్యాచ్‌లు జనవరి 23 నుంచి జరుగుతాయి. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు నాలుగు క్వార్టర్‌ ఫైనల్స్‌ను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు రెండు సెమీఫైనల్స్‌ జరుగుతాయి. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు జరిగే ఫైనల్‌తో రంజీ ట్రోఫీ సీజన్‌కు తెర పడుతుంది.  

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై జట్టు మరోసారి భారీ బలగంతో బరిలోకి దిగుతోంది. దేశవాళీ దిగ్గజంగా గుర్తింపు సాధించిన ముంబై జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించనుండగా... శ్రేయస్‌ అయ్యర్, పృథ్వీ షా కీలకం కానున్నారు. ఖాన్‌ బ్రదర్స్‌లో... ముషీర్‌ ఖాన్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడగా... సర్ఫరాజ్‌ ఖాన్‌ జాతీయ జట్టుకు ఎంపివడం ఖాయమే. ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు భారత ‘ఎ’ జట్టు అక్కడ పర్యటించనున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు కూడా పలు మ్యాచ్‌లకు దూరం కానున్నారు. 

ఈ నేపథ్యంలో నయా హీరోలు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. జాతీయ జట్టుకు దూరమైన అజింక్యా రహానే, చతేశ్వర్‌ పుజారాతో పాటు... అడపా దడపా జట్టులోకి వచ్చి పోతున్న శ్రేయస్‌ అయ్యర్, గతంలో మెరుగైన ప్రదర్శన చేయలేక చోటు కోల్పోయిన ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్‌ భరత్‌ వంటి వాళ్లు తిరిగి సత్తా చాటాలని చూస్తున్నారు. ఇక యశ్‌ ధుల్, సారాంశ్‌ జైన్, విద్వత్‌ కావేరప్ప, వైశాఖ్‌ విజయ్‌ కుమార్‌ వంటి వాళ్లు సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు సమాయత్తమయ్యారు.  

జట్ల వివరాలు 
గ్రూప్‌ ‘ఎ’: ముంబై, బరోడా, మహారాష్ట్ర, ఒడిశా, జమ్మూ కశ్మీర్, సర్వీసెస్, మేఘాలయ, త్రిపుర. 
గ్రూప్‌ ‘బి’: ఆంధ్ర, హైదరాబాద్, గుజరాత్, విదర్భ, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి. 
గ్రూప్‌ ‘సి’: బెంగాల్, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, హరియాణా, బిహార్‌. 
గ్రూప్‌ ‘డి’: తమిళనాడు, ఢిల్లీ, సౌరాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, చండీగఢ్, రైల్వేస్, అస్సాం. 

ప్రైజ్‌మనీ ఎంతంటే... 
విజేత: రూ. 5 కోట్లు 
రన్నరప్‌: రూ. 3 కోట్లు 
సెమీఫైనల్లో ఓడిన జట్లకు: రూ. 1 కోటి చొప్పున

మ్యాచ్‌ ఫీజు ఎంతంటే  (తుది జట్టులో ఉన్న వారికి) 
40 లేదా అంతకంటే ఎక్కువ రంజీ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లకు: రోజుకు రూ. 60 వేలు చొప్పున (రిజర్వ్‌ ప్లేయర్లకు: రూ. 30 వేలు చొప్పున) 
21 నుంచి 40 రంజీ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లకు: రోజుకు రూ. 50 వేలు చొప్పున (రిజర్వ్‌ ప్లేయర్లకు: రూ. 25 వేలు చొప్పున) 
1 నుంచి 20 రంజీ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లకు: రూ. 40 వేలు చొప్పున (రిజర్వ్‌ ప్లేయర్లకు: రూ. 20 వేలు చొప్పున).  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement