
West Indies vs India, 5th T20I - Nicholas Pooran: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ టీమిండియాతో టీ20 సిరీస్‌లో అదరగొట్టాడు. మేజర్ క్రికెట్ లీగ్-2023 ఫామ్‌ను కొనసాగిస్తూ.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నిక్కీ వరుసగా 41, 67(ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్), 20, 1, 47 పరుగులు సాధించాడు.
పాండ్యా బౌలింగ్‌లో..
ముఖ్యంగా నిర్ణయాత్మకమైన ఐదో టీ20లో ఓపెనర్ బ్రాండన్ కింగ్(85- నాటౌట్)తో కలిసి విండీస్‌ను గెలుపుబాట పట్టించడంలో కీలకంగా వ్యవహరించాడు. 35 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇందులో రెండు సిక్స్‌లు టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బాదినవే!
చాలెంజ్‌కు ప్రతీకారంగా
అయితే, ఆట తీరుతో ఆకట్టుకున్న నికోలస్ పూరన్.. హార్దిక్ పాండ్యాకు మించిన ఆటిట్యూడ్‌తో టీమిండియా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మూడో టీ20 ముగిసిన తర్వాత హార్దిక్.. ‘‘నిక్కీ నా బౌలింగ్‌ను టార్గెట్ చేస్తాడేమో! మరేం పర్లేదు.. నాకిలాంటివి ఇష్టమే. అతడు నా మాటలు విని నన్ను లక్ష్యంగా చేసుకున్నా.. ఆఖర్లో నాకు వికెట్ సమర్పించుకోవాల్సిందే!’’ అని చాలెంజ్ విసిరాడు.
నోరు మూసుకోండి
అయితే, ఐదో టీ20లో ఇది బ్యాక్‌ఫైర్ అయింది. పాండ్యా బౌలింగ్‌లోనే పూరన్ మంచి షాట్లు ఆడాడు. కానీ.. తిలక్ వర్మ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇదిలా ఉంటే.. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన వెస్టిండీస్ 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది.
విజయానంతరం వెంటనే విండీస్‌కు బయల్దేరిన నికోలస్ పూరన్ షేర్ చేసిన రీల్ టీమిండియా ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. అకీల్ హొసేన్‌తో కలిసి.. ‘‘నోరు మూసుకోవాలి’’ అన్నట్లు అభినయించాడు.
అక్కడ చూపించు నీ సత్తా
‘‘ఒకవేళ దీని గురించి మీకు తెలిస్తే.. తెలుసనే అనుకోండి’’ అని క్యాప్షన్ జతచేశాడు. దీంతో నిక్కీ హార్దిక్‌నే టార్గెట్ చేశాడని.. భారత జట్టును కూడా అవమానించే విధంగా వ్యవహరించాడంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మేజర్ ఈవెంట్లో నీ సత్తా చూపించు.. అప్పుడు నమ్ముతాం గొప్ప బ్యాటర్‌వి అని ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్ వాళ్లకే! అతడు హీరో: విండీస్ కెప్టెన్