PC: BCCI
భారత స్పిన్నర్ దీప్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధి వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా దీప్తి ఆదివారం ఈ ఫీట్ నమోదు చేసింది.
ప్రపంచకప్ టోర్నీలో తప్పక సెమీస్ చేరాల్సిన మ్యాచ్‌లో భారత్ మెరుగైన స్కోరు సాధించింది. లార్డ్స్ వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే రేణుకా సింగ్ జార్జియా వోల్ (4)ను వికెట్ల ముందుకు దొరకబుచ్చుకుంది. ఆ తర్వాత ఏడో ఓవర్లో శ్రీచరణి ఫోబీ లిచిఫీల్డ్ (24)ను అవుట్ చేసింది. అనంతరం తొమ్మిదో ఓవర్‌లో దీప్తి రంగంలోకి దిగి తొలి బంతికే బెత్ మూనీని వెనక్కి పంపింది.
దీప్తి బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మూనీ (22) రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో దీప్తికి ఇది 356వ వికెట్. తద్వారా అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా దీప్తి నిలిచింది.
అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వికెట్ల వీరులు
దీప్తి శర్మ (ఇండియా)- 356
ఝులన్ గోస్వామి (ఇండియా)- 355
ఎలిస్ పెర్రి (ఆస్ట్రేలియా)- 336
కేథరిన్ సీవర్ బ్రంట్ (ఇంగ్లండ్)- 335
సోఫీ ఎక్లిస్టోన్ (ఇంగ్లండ్)- 333
షబ్నం ఇస్మాయిల్ (సౌతాఫ్రికా)- 323.


