One Match Ban On Pujara: పుజారాపై సస్పెన్షన్‌ వేటు

County Championship 2023: Sussex Penalised, Pujara Suspended - Sakshi

భారత టెస్ట్‌ ఆటగాడు, నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారాపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇంగ్లండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2023లో పుజారా సారథ్యం వహిస్తున్న ససెక్స్‌ జట్టుకు 12 పాయింట్లు పెనాల్టీ పడగా.. దీని ఫలితం​ జట్టు కెప్టెన్‌ అయిన పుజారాపై పడింది. పుజారాపై ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు కౌంటీ ఛాంపియన్‌షిప్‌ అధికారులు వెల్లడించారు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు నిబంధనల ప్రకారం ఓ సీజన్‌లో ఓ జట్టు నాలుగు ఫిక్స్‌డ్‌ పెనాల్టీలను ఎదుర్కొంటే, సదరు జట్టు కెప్టెన్‌పై ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు పడుతుంది. ప్రస్తుత సీజన్‌లో ససెక్స్‌ నాలుగు ఫిక్స్‌డ్‌ పెనాల్టీలను ఎదుర్కొంది.

టోర్నీ తొలి లెగ్‌లో రెండు ఫిక్స్‌డ్‌ పెనాల్టీలను ఎదుర్కొన్న ససెక్స్‌.. సెప్టెంబర్‌ 13న లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో రెండు పెనాల్టీలను పొంది, మొత్తంగా 12 డీమెరిట్‌ పాయింట్లను పొందింది. పుజారాపై సస్పెన్షన్‌ను ససెక్స్‌ అధికారులు ఎలాంటి వాదనలు లేకుండా స్వీకరించారు. ఆటగాళ్ల ఆన్‌ ఫీల్డ్‌ ప్రవర్తన కారణంగా ససెక్స్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్‌ ఆటగాళ్లు టామ్‌ హెయిన్స్‌, జాక్‌ కార్సన్‌, అరి కార్వెలాస్‌లు మైదానంలో నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించడంతో కెప్టెన్‌ పుజారా బాధ్యుడయ్యాడు.

ఈ ముగ్గురు ఆటగాళ్లలో టామ్‌ హెయిన్స్‌, జాక్‌ కార్సన్‌లపై ససెక్స్‌ అధికారులు తదుపరి మ్యాచ్‌కు వేటు వేశారు. విచారణ అనంతరం కార్వెలాస్‌పై కూడా చర్యలు ఉంటాయని వారు తెలిపారు. కాగా, పాయింట్ల కోత కారణంగా ప్రస్తుత కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్‌ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ససెక్స్‌ ఖాతాలో 124 పాయింట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే, కౌంటీ డివిజన్‌ 2 పోటీల్లో భాగంగా ససెక్స్‌ సెప్టెంబర్‌ 19-22 వరకు డెర్బీషైర్‌తో తలపడాల్సి ఉంది. అనంతరం సెప్టెంబర్‌ 26న గ్లోసెస్టర్‌షైర్‌ను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లతో ప్రస్తుత సీజన్‌ ముగుస్తుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం డర్హమ్‌ లీడింగ్‌లో ఉంది. ఆ జట్టు 198 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top