
2 వికెట్లతో సూపర్ కింగ్స్ విజయం
కోల్‌కతా: ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ అవకాశాలపై దెబ్బ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అజింక్య రహానే (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్ (21 బంతుల్లో 38; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మనీశ్ పాండే (28 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించగా...నూర్ అహ్మద్‌కు 4 వికెట్లు దక్కాయి.
అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు సాధించింది. డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా...శివమ్ దూబే (40 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఉర్విల్ పటేల్ (11 బంతుల్లో 31; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. పవర్‌ప్లేలోపే సగం వికెట్లు కోల్పోయి 60/5 వద్ద నిలిచిన చెన్నై ఓటమి ఇక లాంఛనమే అనిపించింది.
కానీ బ్రెవిస్, దూబే పోరాడంతో పాటు చివర్లో ధోని (17 నాటౌట్) పట్టుదలగా నిలబడటంతో గెలుపు సాధ్యమైంది. తాజా ఫలితంతో కోల్‌కతా ‘ప్లే ఆఫ్స్’కు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది. మిగిలిన 2 మ్యాచ్‌లలో గెలిచి గరిష్టంగా 15 పాయింట్లకు చేరినా ముందుకెళ్లడం కష్టమే. సాంకేతికంగా రేసులో ఉన్నా... ఈసారి కథ ముగిసినట్లే!
ఐపీఎల్‌లో నేడు
పంజాబ్ X ఢిల్లీ
వేదిక: ధర్మశాల
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం