
ఒకరు 1500 మీటర్లలో...
మరొకరు 5000 మీటర్లలో
మెరిసిన కెన్యా మహిళా అథ్లెట్లు ఫెయిత్ కిపియేగాన్, బిట్రెస్ చెబెట్
యుజీన్ (అమెరికా): మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్‌లో తమకు తిరుగులేదని కెన్యా మహిళా అథ్లెట్లు మరోసారి నిరూపించుకున్నారు. డైమండ్ లీగ్‌లో భాగంగా అమెరికాలోని యుజీన్‌లో జరిగిన ప్రిఫోంటెయిన్ క్లాసిక్ మీట్‌లో ఇద్దరు కెన్యా మహిళా అథెట్లు రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టారు.
మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఫెయిత్ కిపియేగాన్ 1500 మీటర్ల విభాగంలో... పారిస్ ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు గెలిచిన బిట్రెస్ చెబెట్ 5000 మీటర్లలో కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించారు. 31 ఏళ్ల కిపియేగాన్ 1500 మీటర్ల దూరాన్ని 3 నిమిషాల 48.68 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది.
ఈ క్రమంలో గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో 3 నిమిషాల 49.04 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిపియేగాన్ తిరగరాసింది. కిపియేగాన్ 2016 రియో, 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచి 1500 మీటర్ల విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు 5000 మీటర్ల దూరాన్ని 25 ఏళ్ల బిట్రెస్ చెబెట్ 13 నిమిషాల 58.06 సెకన్లలో ముగించి తన పేరిట కొత్త ప్రపంచ రికార్డును లిఖించుకుంది.
5000 మీటర్ల దూరాన్ని 14 నిమిషాల్లోపు పూర్తి చేసిన తొలి మహిళా అథ్లెట్‌గా గుర్తింపు పొందిన చెబెట్... రెండేళ్ల క్రితం ప్రిఫోంటెయిన్ క్లాసిక్ మీట్‌లో 14 నిమిషాల 00.21 సెకన్లతో గుడాఫ్ సెగె (ఇథియోపియా) సృష్టించిన ప్రపంచ రికార్డును సవరించింది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో చెబెట్ 5000, 10,000 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గి విశ్వ క్రీడల్లో అరుదైన ‘డబుల్’ సాధించిన మూడో అథ్లెట్‌గా గుర్తింపు పొందింది.