
దాదాపు దశాబ్దం క్రితం రద్దయిన చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ (Champions League T20)ని మళ్లీ ప్రారంభించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) యోచిస్తోంది. దీనిని సమర్థవంతంగా నిర్వహించేందుకుకొత్తగా ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమైంది. సింగపూర్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో చాంపియన్స్ లీగ్‌పై వచ్చిన ప్రతిపాదనకు అన్ని బోర్డులూ మద్దతు పలికినట్లు సమాచారం.
అందుకే పక్కన పెట్టారు
కాగా వేర్వేరు దేశాలకు చెందిన క్లబ్ టీమ్‌లు బరిలోకి దిగుతూ 2009–2014 మధ్య నిర్వహించిన ఈ టోర్నీని పలు కారణాలతో రద్దు చేశారు. ఐపీఎల్‌లాంటి టోర్నీలతో పోలిస్తే ప్రేక్షకాదరణ చాలా తక్కువగా ఉండటంతో పాటు వాణిజ్యపరంగా కూడా సరైన స్పందన లభించకపోవడంతో లీగ్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది.
అంత ఈజీ ఏం కాదు
అయితే ఇప్పుడు కూడా దీనిని నిర్వహించడం అంత సులువు కాకపోవచ్చు. టీ20 స్టార్ ఆటగాళ్లంతా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు జట్ల తరఫున ఆడుతున్నారు. చాంపియన్స్ లీగ్ జరిగితే వారు ఏ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తారనే విషయంలో నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు.
మరోవైపు టెస్టు క్రికెట్‌ను రెండు వేర్వేరు స్థాయిల్లో (2 టియర్ సిస్టం) నిర్వహించాలనే ఆలోచనతో ఉన్న ఐసీసీ దీనిపై సాధ్యాసాధ్యాల కోసం ప్రత్యేకంగా వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యుల ఈ కమిటీకి ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా నాయకత్వం వహిస్తారు.
చాంపియన్స్ లీగ్ టీ20 (2009-2014) విజేతల జాబితా ఇదే
👉2009- న్యూ సౌత్ వేల్స్ బ్లూస్- కెప్టెన్ సైమన్ కటిచ్ (బిగ్‌బాష్ లీగ్)
👉2010- చెన్నై సూపర్ కింగ్స్- కెప్టెన్ ఎంఎస్ ధోని (ఐపీఎల్)
👉2011- ముంబై ఇండియన్స్- కెప్టెన్ హర్భజన్ సింగ్(ఐపీఎల్)
👉2012- సిడ్నీ సిక్సర్స్- కెప్టెన్ బ్రాడ్ హాడిన్ (బిగ్‌బాష్ లీగ్)
👉2013- ముంబై ఇండియన్స్- కెప్టెన్ రోహిత్ శర్మ (ఐపీఎల్)
👉2014- చెన్నై సూపర్ కింగ్స్- కెప్టెన్ ఎంఎస్ ధోని (ఐపీఎల్).
చదవండి: IND vs ENG: కరుణ్‌పై వేటు.. అతడి అరంగేట్రం?.. తుదిజట్టు ఇదే!