
స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడిన నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు క్లిష్టతరంగా మారింది. పేసర్లలో ఆకాశ్ దీప్ (Akash Deep) ఫిట్‌నెస్‌లేమితో సతమతమవుతుండగా.. అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు.. లోయర్ ఆర్డర్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ రాణించగల ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
శార్దూల్ ఠాకూర్ మళ్లీ జట్టులోకి?
ఎడమ మోకాలికి గాయమైన కారణంగా నితీశ్ రెడ్డి ఇంగ్లండ్‌తో మిగిలిన ఉన్న రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో మాంచెస్టర్ టెస్టు కోసం జట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి స్థానంలో సీనియర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాడా? అనే చర్చ జరుగుతోంది.
లేదంటే.. బీసీసీఐ తాజాగా జట్టులోకి తీసుకున్న మరో ఆల్‌రౌండర్ అన్షుల్ కాంబోజ్‌పై మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచుతుందేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శార్దూల్, అన్షుల్ ఇద్దరూ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లే కాబట్టి.. వీరిలో ఒకరికే అవకాశం ఇచ్చి.. ఆకాశ్ దీప్ స్థానాన్ని ప్రసిద్ కృష్ణతో భర్తీ చేస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది.
తద్వారా అన్షుల్ రూపంలో ఆల్‌రౌండర్‌తో పాటు ప్రసిద్‌ను తీసుకోవడం ద్వారా పేస్ బౌలింగ్ దళం బలం కూడా పెరుగుతుంది. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు తోడుగా ప్రసిద్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది.
ధ్రువ్ జురెల్‌కు ఛాన్స్
అయితే, బ్యాటింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలనుకుంటే మాత్రం వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు ఛాన్స్ దక్కుతుంది. నిజానికి నాలుగో టెస్టులో రిషభ్ పంత్ వేలి గాయం కారణంగా.. కేవలం బ్యాటర్‌గానే అందుబాటులో ఉంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వికెట్ కీపర్‌గా జురెల్‌కు లైన్ క్లియర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కరుణ్ నాయర్‌పై ఈసారి వేటు
మరోవైపు.. వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌పై ఈసారి వేటు పడే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే యువ ఆటగాడు సాయి సుదర్శన్ తన కెరీర్‌లో రెండో టెస్టు ఆడేందుకు మార్గం సుగమమవుతుంది. ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ టెస్టు వికెట్ దృష్ట్యా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఈసారైనా బరిలోకి దింపాలనే సూచనలు వస్తున్నాయి.
కుల్దీప్‌ను ఈసారైనా ఆడించండి
బంతిని రెండు వైపులా టర్న్ చేయగల సత్తా కుల్దీప్‌నకు ఉందని.. అతడిని నాలుగో టెస్టులో ఆడిస్తే ఉపయోగకరంగా ఉంటుందని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. దూకుడుగా ఆడే ఇంగ్లండ్ బ్యాటర్లు అంత సులువుగా కుల్దీప్‌ను అటాక్ చేయలేరని.. కాబట్టి అతడిని తప్పక తీసుకోవాలని సూచించాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో ఉన్న రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లకు కుల్దీప్ కూడా తోడైతే జట్టు మరింత పటిష్టమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2-1తో ఆధిక్యంలో ఇంగ్లండ్
కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌కు వెళ్లింది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ సేన జయభేరి మోగించింది. ఇరుజట్ల మధ్య లార్డ్స్‌లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో 22 పరుగుల తేడాతో గెలిచిన స్టోక్స్ బృందం.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సంపాదించింది. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23-27)కు మాంచెస్టర్ వేదిక. ఇందులో భారత్ తప్పకుండా గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత తుదిజట్టు (అంచనా)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్/అన్షుల్ కాంబోజ్.
చదవండి: ‘వైభవ్ సూర్యవంశీని చూడగానే ఫిక్సయిపోయాం.. అతడొక అద్భుతం’