మాజీ ఛాంపియన్‌కు ముచ్చెమటలు పట్టించిన కేప్‌ వెర్డే | Cape Verde earn thrilling draw with Uruguay at 2026 World Cup | Sakshi
Sakshi News home page

మాజీ ఛాంపియన్‌కు ముచ్చెమటలు పట్టించిన కేప్‌ వెర్డే

Jun 22 2026 7:47 AM | Updated on Jun 22 2026 10:36 AM

Cape Verde earn thrilling draw with Uruguay at 2026 World Cup

ఫిఫా వరల్డ్‌కప్‌-2026లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జట్లలో కేప్‌ వెర్డే ఒకటి. టోర్నీ ప్రారంభం నుంచి అంచనాలకు మించి రాణిస్తున్న ఈ ఆఫ్రికన్‌ జట్టు మరోసారి సత్తా చాటింది. మాజీ ఛాంపియన్‌ ఉరుగ్వేతో జరిగిన కీలక పోరును 2-2తో డ్రా చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తమ తొలి వరల్డ్‌కప్‌ గోల్స్‌ను కూడా సాధించింది. ఈ ఫలితంతో నాకౌట్‌ ఆశలను మరింత బలోపేతం చేసుకుంది.

ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచి ఉరుగ్వే ఆధిపత్యం కనబర్చినా, బంతిపై ఎక్కువ నియంత్రణ కలిగింది మాత్రం కేప్‌వెర్డేనే. స్పెయిన్‌పై తొలి మ్యాచ్‌ తరహాలోనే  కేప్‌వెర్డే ఈ మ్యాచ్‌లోనూ రక్షణాత్మక వ్యూహంతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టింది. తొలి 20 నిమిషాల పాటు రక్షణకే ప్రాధాన్యం ఇచ్చిన ఈ జట్టు, 21వ నిమిషంలో వచ్చిన ఫ్రీ కిక్‌ను అద్భుతంగా సద్వినియోగం చేసుకుంది.

కెవిన్‌ పినా దూరం నుంచి కొట్టిన శక్తివంతమైన షాట్‌ నేరుగా గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. దీంతో 1-0 ఆధిక్యంలోకి వెళ్లడమే కాకుండా, తమ తొలి వరల్డ్‌కప్‌ గోల్‌ను కూడా నమోదు చేసింది.

ఆ తర్వాత మళ్లీ కేప్‌ వెర్డే రక్షణపై దృష్టి పెట్టింది. కానీ తొలి అర్ధభాగం చివర్లో ఉరుగ్వే తన అనుభవాన్ని చూపించింది. ముందుగా మాక్సీ అరౌజో గోల్‌ సాధించాడు. గోల్‌ ముందు జరిగిన గందరగోళాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు, స్కోరును 1-1గా మార్చాడు. ఆ ఉత్సాహంలోనే దాడులు కొనసాగించిన ఉరుగ్వేకు మరికొద్ది సేపటికే మరో గోల్‌ లభించింది. బాక్స్‌లోకి వచ్చిన బంతిని అగస్టిన్‌ కానోబ్బియో గోల్‌గా మలచడంతో ఉరుగ్వే 2-1 ఆధిక్యంతో విరామానికి వెళ్లింది.

రెండో అర్ధభాగం ప్రారంభంలో కేప్‌వెర్డే ఆటలో కొంత నిదానం కనిపించింది. గోల్‌కీపర్‌ వోజిన్హా కొట్టిన బంతులు సరిగా సహచరులకు చేరకపోవడంతో ఉరుగ్వేకు మరిన్ని అవకాశాలు లభించాయి. ఈ పరిస్థితిని గమనించిన కోచ్‌ నునో డా కోస్టా, హెలియో వరెలాలను మైదానంలోకి దింపాడు. ఈ మార్పులు కేప్‌ వెర్డే ఆటలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.

ఈ దూకుడే 61వ నిమిషంలో ఫలితాన్నిచ్చింది. ఉరుగ్వే డిఫెండర్‌ మాథియస్‌ ఒలివేరా చేసిన పొరపాటు కారణంగా బంతి హెలియో వరెలా వద్దకు చేరింది. పరిస్థితిని అంచనా వేయకుండా ముందుకు వచ్చిన గోల్‌కీపర్‌ ముస్లేరాను చాకచక్యంగా తప్పించుకున్న వరెలా ఖాళీ గోల్‌లో బంతిని పంపించాడు. దీంతో స్కోరు 2-2గా మారింది.

ఆ తర్వాత మ్యాచ్‌ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. కేప్‌వెర్డేకు 3-2 ఆధిక్యం సాధించే అవకాశం వచ్చినా మోంటెయిరో కొట్టిన షాట్‌ తృటిలో గోల్‌ పోస్ట్‌ను మిస్‌ అయ్యింది. మరోవైపు ఉరుగ్వేకు కూడా గోల్‌ వచ్చినట్లే వచ్చి చేజారింది. వీడియో అసిస్టెంట్‌ రిఫరీ (వీఏఆర్‌) జోక్యంతో వారు చేసిన ఓ గోల్‌ రద్దైంది. చివరి పది నిమిషాల్లో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడాయి.

మ్యాచ్‌ చివరి దశలో వోజిన్హా చేసిన చిన్న పొరపాటు ఉరుగ్వేకు అవకాశం ఇచ్చినా, కేప్‌వెర్డే రక్షణ అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాన్ని తప్పించింది. అదనపు సమయంలో కూడా రెండు జట్లు అవకాశాలు సృష్టించినప్పటికీ గోల్‌గా మలచలేకపోయాయి. చివరకు మ్యాచ్‌ 2-2తోడ్రాగా ముగిసింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement