T20 World cup 2026: మరో విదేశీ జట్టుకు కెప్టెన్‌గా భారతీయుడు | Canada announce 15 member squad for T20 World Cup 2026, India born Dilpreet Bajwa to lead | Sakshi
Sakshi News home page

T20 World cup 2026: మరో విదేశీ జట్టుకు కెప్టెన్‌గా భారతీయుడు

Jan 15 2026 11:01 AM | Updated on Jan 15 2026 12:15 PM

Canada announce 15 member squad for T20 World Cup 2026, India born Dilpreet Bajwa to lead

ఇటీవలికాలంలో ఇతర దేశాల క్రికెట్‌ జట్లలో భారతీయ మూలాలున్న ఆటగాళ్ల ప్రాతినిథ్యం ఎక్కువైంది. దాదాపు అన్ని ఐసీసీ సభ్య దేశాలు, అసోసియేట్‌ దేశాల జట్లలో భారతీయులు ఉంటున్నారు. ఆస్ట్రేలియా లాంటి జట్లలో సైతం భారతీయులు అవకాశాల కోసం పోటీపడుతున్నారు.

న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్లలో చాలాకాలం నుంచే భారతీయులకు ప్రాతినిథ్యం లభిస్తూ వస్తుంది. కనీసం ఒక్క భారత మూలాలున్న ఆటగాడైనా ఈ జట్లలో ఉంటూ వస్తున్నాడు. ఇటీవలికాలంలో సౌతాఫ్రికాలో సైతం భారతీయులు అవకాశాలు దక్కించుకుంటున్నారు. నెదర్లాండ్స్‌, యూఎస్‌ఏ, ఒమన్‌, కెనడా దేశాల జట్లలో అయితే సగానికి పైగా భారతీయులే ఉంటున్నారు.

తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. టీ20 ప్రపంచకప్‌-2026 కోసం ఎంపిక రెండు విదేశీ జట్లకు భారత మూలాలున్న ఆటగాళ్లు కెప్టెన్లుగా నియమితులయ్యారు. ఒమన్‌ జట్టు కెప్టెన్‌గా జతిందర్‌ సింగ్‌.. కెనడా జట్టు కెప్టెన్‌గా దిల్‌ప్రీత్‌ బజ్వా ఎంపికయ్యారు. వీరి జట్లలో భారతీయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఒమన్‌ జట్టులో సగానికి పైగా భారత మూలాలున్న ఆటగాళ్లే కాగా.. తాజాగా ప్రకటించిన కెనడా జట్టులో సైతం అదే స్థాయిలో భారతీయులు ఉన్నారు.  

వీరే కాక ప్రపంచకప్‌ కోసం ఇప్పటివరకు ప్రకటించిన జట్లలో మరికొంత మంది  భారతీయ మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. న్యూజిలాండ్‌ జట్టులో ఐష్‌ సోధి, రచిన్‌ రవీంద్ర, నెదర్లాండ్‌ జట్టులో ఆర్యన్‌ దత్‌, సౌతాఫ్రికా జట్టులో కేశవ్‌ మహారాజ్‌ లాంటి భారత మూలాలున్న ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.

ఓవరాల్‌గా చూస్తే.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారతీయ మూలాలున్న ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభిస్తుంది. ఈ మెగా టోర్నీ కోసం యూఎస్‌ఏ జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ జట్టుకు సైతం భారత మూలాలున్న మిలింద్‌ కుమార్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ జట్టులో సైతం​ చాలామంది భారతీయులు ఉన్నారు.

ఇదిలా ఉంటే, భారత్‌, శ్రీలంక వేదికలుగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌-2026 కోసం 15 మంది సభ్యుల కెనడా జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా దిల్‌ప్రీత్ బజ్వా ఎంపికయ్యాడు. ఈ జట్టులో చాలామంది భారత మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. మెగా టోర్నీలో కెనడా ప్రయాణం ఫిబ్రవరి 9న సౌతాఫ్రికా మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో కెనడా యూఏఈ, న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు గ్రూప్‌-డిలో ఉంది. మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.

కెనడా టీ20 ప్రపంచ కప్ 2026 జట్టు: దిల్‌ప్రీత్ బజ్వా (C), అజయ్‌వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ ఠాకర్, జస్కరన్‌దీప్ బుట్టార్, కలీమ్ సనా, కన్వర్‌పాల్ తత్గూర్, నవనీత్ ధాలివాల్, నికోలస్ కిర్టన్, రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్‌, శివమ్‌ శర్మ, శ్రేయస్‌ మొవ్వ, యువరాజ్‌ సమ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement