బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఫిఫా వరల్డ్‌కప్-2026 టోర్నీలో బ్రెజిల్ ఆరంభ మ్యాచ్‌కు దిగ్గజ ఆటగాడు నెయ్‌మార్ దూరమయ్యాడు. గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి కూడా అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సాకర్ సమరం శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) అంగరంగ వైభవంగా ఆరంభమైన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో సౌతాఫ్రికాపై గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో దక్షిణ కొరియా చెక్ రిపబ్లిక్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.
గాయపడ్డ దిగ్గజం
ఇక బ్రెజిల్ ఆదివారం వేకువజామున (భారత కాలమానం ప్రకారం) తమ తొలి మ్యాచ్‌లో మొరాకోను ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలాటి నెయ్‌మార్ పిక్కల్లో గాయం కారణంగా బాధపడుతున్నట్లు తెలిపాడు. ‘‘అతడు ఫిట్‌గా మారేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. వచ్చే వారం నాటికి అతడు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాం’’ అని తెలిపాడు.
నిరాశలో అభిమానులు
కాగా ఐదుసార్లు ప్రపంచకప్ గెలిచిన బ్రెజిల్ జట్టులో నెయ్‌మార్ కీలక సభ్యుడే గాక.. ప్రధాన ఆకర్షణ ఉన్న ఆటగాడు. తొలి మ్యాచ్‌కే అతడు లేడని తెలిసి అభిమానులు ఉసూరుమంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చాంపియన్ జట్టుకు తొలి బ్రెజిలేతర మేనేజర్‌గా కార్లో వచ్చాడు. అతడి మార్గదర్శనంలో వరల్డ్‌కప్‌లో జట్టు ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాల్సి ఉంది.
ఇక 48 జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఫుట్‌బాల్ టోర్నీలో.. టీమ్‌లను పన్నెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్- ‘C’లో ఉన్న బ్రెజిల్.. మొరాకో (జూన్ 14), హైతీ (జూన్ 19), స్కాట్లాండ్ (జూన్ 24) జట్లతో అమీతుమీ తేల్చుకోనుంది.


