టీ20 క్రికెట్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ ఓనర్‌గా జహీర్‌ ఖాన్‌ | Belgium Cricket League: Zaheer Khan Joins This Team As Co Owner | Sakshi
Sakshi News home page

టీ20 క్రికెట్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ ఓనర్‌గా జహీర్‌ ఖాన్‌

Mar 17 2026 11:39 AM | Updated on Mar 17 2026 3:16 PM

Belgium Cricket League: Zaheer Khan Joins This Team As Co Owner

టీమిండియా దిగ్గజ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. EUT20 బెల్జియం క్రికెట్‌ లీగ్‌లో భాగమయ్యాడు. ఆంటెర్ప్‌ యాంకర్స్‌ ఫ్రాంఛైజీ సహ యజమానిగా జహీర్‌ ఖాన్‌ చేరినట్లు జట్టు యాజమాన్యం తాజాగా వెల్లడించింది.

యూరోపియన్‌ దేశాల్లో క్రికెట్‌కు ప్రాధాన్యం పెంచే క్రమంలో EUT20 బెల్జియం క్రికెట్‌ లీగ్‌ పుట్టుకొచ్చింది. బ్రసెల్స్‌ వేదికగా జూన్‌ 4- 14 మధ్య ఈ లీగ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. తద్వారా కాంటినెంటల్‌ యూరోప్‌లో ఇదొక చారిత్రాత్మక ముందడుగు పడనుంది.

ఇక ఆంటెర్ప్‌ యాంకర్స్‌ సహ యజమానిగా అధికారిక కార్యక్రమాలు, మార్కెటింగ్‌ కార్యకలాపాలు, మీడియా సమావేశాల్లో జహీర్‌ ఖాన్‌ భాగం కానున్నాడు. వ్యాపార భాగస్వామిగా మాత్రమే కాకుండా జట్టును తీర్చిదిద్దడంలోనూ ఈ మాజీ పేసర్‌ కీలక పాత్ర పోషించనున్నాడు.

ఈ సందర్భంగా.. ‘‘యూరోప్‌లో క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉంది. ఆరంభ దశలోనే ఆంటెర్ప్‌ యాంకర్స్‌ సహ యజమానిగా చేరడం కేవలం వ్యాపార దృష్ట్యానే కాకుండా జట్టును తీర్చిదిద్దడంలోనూ ఉపయోగపడుతుంది. కొత్త ప్రతిభను వెలికితీసి.. వాళ్లకు వేదిక కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.

నా మనసుకు ఎంతో దగ్గరైన ఫ్రాంఛైజీ ఇది. బ్రసెల్స్‌లో జరిగే లీగ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని జహీర్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. కాగా ఆంటెర్ప్‌ యాంకర్స్‌లో వెస్టిండీస్‌ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్‌ భాగం కావడంతో జట్టుకు పాపులారిటీ తెచ్చింది. 

ఇక జహీర్‌ ఖాన్‌ తమతో జట్టు కట్టడం పట్ల ఆంటెర్ప్‌ యాంకర్స్‌ యజమాని నాగేంద్ర సిద్దోటం హర్ష్యం వ్యక్తం చేశారు. కాగా గతేడాది ఐపీఎల్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు జహీర్‌ ఖాన్‌ మెంటార్‌గా ఉండగా.. 2026 సీజన్‌ ఆరంభానికి ముందే ఆ జట్టుతో బంధం తెంచుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement