
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి (Manoj Tiwary) సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను పక్కనపెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో అంతర్గత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించాడు. వన్డే ప్రపంచకప్-2027 నాటికి రోహిత్ తనకు తానుగా తప్పుకొనేలా చేయాలని చూస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
కొత్తగా బ్రోంకో టెస్టు
అయితే, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) దగ్గర మాత్రం వారి పప్పులు ఉడకవని మనోజ్ తివారి పేర్కొన్నాడు. అసలు విషయం ఏమిటంటే.. బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్‌నెస్ పరీక్షకు కొత్తగా బ్రోంకో టెస్టును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రగ్బీ, ఫుట్‌బాల్ ఆటగాళ్లకు నిర్వహించే బ్రోంకో టెస్టు ద్వారా టీమిండియా క్రికెటర్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించాలని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (CoE) నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఆటగాడు తొలుత 20 మీటర్ల షటిల్ రన్ చేయాలి. తర్వాత దీనిని 40, 60 మీటర్లకు పెంచుతారు. ఈ మూడూ కలిపి ఒక సెట్ కాగా.. మొత్తంగా ఐదు సెట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే.. ఓవరాల్‌గా 1200 మీటర్ల దూరం విరామం లేకుండా ఆటగాడు వేగంగా పరుగుతీయాలి. ఇందుకు కేవలం ఆరు నిమిషాల సమయం ఉంటుంది.
కోహ్లిని తప్పించలేరు.. రోహిత్‌పై వేటు వేసేందుకు కుట్ర
ఈ నేపథ్యంలో బ్రోంకో టెస్టు గురించి మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘‘వన్డే వరల్డ్‌కప్-2027 ప్రణాళికల నుంచి విరాట్ కోహ్లిని తప్పించడం అంత తేలికేమీ కాదు. అయితే, రోహిత్ శర్మపై విషయంలో మాత్రం వారు సఫలమయ్యే అవకాశం ఉంది. భారత క్రికెట్‌లో ఏం జరుగుతుందో నేను గత కొన్నాళ్లుగా నిశితంగా పరిశీలిస్తున్నా.
కొన్ని రోజుల క్రితం బ్రోంకో టెస్టు ప్రవేశపెట్టారు. రోహిత్ శర్మ లాంటి వాళ్లను బయటకు పంపేందుకే ఇలాంటి కఠినమైన ఫిట్‌నెస్ పరీక్షను తీసుకువచ్చారు. అన్నిటికంటే ఇదే టఫెస్ట్ ఫిట్‌నెస్ టెస్టు. అయినా.. ఇప్పుడే ఇది ఎందుకు ప్రవేశపెట్టారు? హెడ్‌కోచ్‌గా తొలి టెస్టు సిరీస్‌కు సన్నద్ధమైనపుడే దీనిని తీసుకురావాల్సింది.
ఈ ప్రశ్నలకు నాకైతే బదులు తెలియదు. అయితే, నిశితంగా పరిశీలిస్తే మాత్రం రోహిత్ శర్మ ఈ టెస్టు పాస్ కావడం కష్టం. అతడు ఫిట్‌నెస్‌పై అంతగా దృష్టి పెట్టడు. బ్రోంకో టెస్టు ద్వారా అతడిని ఆపేయాలనే ఉద్ధేశంతో ఉన్నారని నాకు సందేహం’’ అంటూ మనోజ్ తివారి పరోక్షంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.
చదవండి: ఒక్క సిక్స్‌తో అంతా తలకిందులయ్యేది.. అప్పుడు నేను..: సిరాజ్