
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఫిట్‌నెస్ సమస్యల వల్ల ఈ టూర్‌లో కేవలం మూడు టెస్టులే ఆడగా.. అతడి గైర్హాజరీలో ఈ హైదరాబాదీ బౌలర్ పేస్ దళాన్ని ముందుండి నడిపించాడు.
సిరీస్ మొత్తానికే హైలైట్
అలుపున్నదే ఎరుగక ఐదు టెస్టుల్లోనూ అవిరామంగా ఆడి.. ఈ సిరీస్‌లో వెయ్యికి పైగా బంతులు బౌల్ చేశాడు సిరాజ్. మొత్తంగా ఐదు టెస్టుల్లో కలిపి 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. ఇక ఆఖరిదైన ఐదో టెస్టులో చివరి రోజు సిరాజ్ ఆట సిరీస్ మొత్తానికే హైలైట్‌గా నిలిచిందని చెప్పవచ్చు.
ముఖ్యంగా.. తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ గెలుపునకు ఏడు పరుగుల దూరంలో ఉన్న వేళ సిరాజ్.. ఆఖరి వికెట్ కూల్చి భారత్‌ను విజయతీరాలకు చేర్చిన తీరు చిరకాలం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. అయితే, నరాలుతెగే ఉత్కంఠ నెలకొన్న ఆ తరుణంలో తాను ఎలాంటి వ్యూహాన్ని అమలు చేశానో సిరాజ్ తాజాగా వెల్లడించాడు.
సింగిల్స్‌తో మేనేజ్ చేసిన అట్కిన్సన్
ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయిన తర్వాత గస్ అట్కిన్సన్‌కు క్రిస్ వోక్స్ తోడయ్యాడు. భుజం విరిగినప్పటికీ జట్టు కోసం వోక్స్ అప్పుడు క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో సింగిల్స్‌తో మేనేజ్ చేసిన అట్కిన్సన్.. ఓవర్లో ఆఖరి బంతికి కూడా సింగిల్‌తీసి స్ట్రైక్ తనే అట్టిపెట్టుకుంటూ వోక్స్‌కు ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు.
ఈ క్రమంలో సిరాజ్.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి రనౌట్‌కు ప్లాన్ చేయగా.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కారణంగా అది మిస్సయింది. ఆ తర్వాత సిరాజ్ తన వ్యూహం మార్చేసి అద్భుత డెలివరితో అట్కిన్సన్‌ను బౌల్డ్ చేయడంతో టీమిండియా విజయం ఖరారైంది.
ఒక్క సిక్స్‌తో అంతా తలకిందులయ్యేది
తాజాగా ఇందుకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సిరాజ్.. ‘‘ఒక ఓవర్లో నేను యార్కర్ వేశాను. అలాంటి సందర్భంలో మరుసటి బంతి లెంగ్త్ బాల్‌గా సంధిస్తారని బ్యాటర్ అనుకుంటాడు. అంతేకాదు.. అంతకుముందు నేను వేసిన లెంగ్త్ బాల్‌ను అతడు సిక్సర్‌గా మలిచాడు.
నేను బౌలింగ్ చేసేందుకు పరుగు మొదలుపెట్టినపుడు నా బౌలింగ్ శైలి ఎలా ఉండాలో నిర్ణయించుకుంటా. విజయానికి ఆరు పరుగులు.. వాళ్లు ఒక్క సిక్సర్ కొట్టినా మ్యాచ్ మా నుంచి చేజారిపోతుంది.
అందుకే నేను బ్యాటర్‌ను తికమకపెట్టి బౌల్డ్ చేయడం ద్వారా ఫలితాన్ని మార్చివేయగలిగాను. నేను ఎలా బౌలింగ్ చేయాలనుకున్నానో దానిని పక్కాగా అమలు చేసి సఫలమయ్యాను. నిజంగా అదో అద్భుత అనుభవం.
ఐదు రోజుల పాటు ఆసక్తిగా సాగిన టెస్టు మ్యాచ్‌లో ఆఖరి రోజు చివర్లో గెలవడం సూపర్‌గా అనిపించింది. నా మనసు ఎంతో ప్రశాంతంగా మారిపోయింది’’ అని పేర్కొన్నాడు. తనకు ఈ మ్యాచ్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని సిరాజ్ రెవ్‌స్పోర్ట్స్‌తో చెప్పుకొచ్చాడు.
2-2తో సమంగా
కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ-2025లో భాగంగా జూన్ 20- ఆగష్టు 4 వరకు ఇంగ్లండ్- టీమిండియా మధ్య ఐదు టెస్టులు జరిగాయి. లీడ్స్‌లో ఇంగ్లండ్.. బర్మింగ్‌హామ్‌లో భారత్ గెలవగా.. లార్డ్స్‌లో మరోసారి ఆతిథ్య జట్టుదే పైచేయి అయింది. ఈ క్రమంలో మాంచెస్టర్ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. ఓవల్‌లో విజయం సాధించి 2-2తో సమం చేసింది.
చదవండి: Sachin Tendulkar: ‘అతడొక గొప్ప టెస్టు ప్లేయర్.. చూడగానే కెప్టెన్ అవుతాడని చెప్పాను’