
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా, శతక శతకాల ధీరుడిగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) చరిత్ర చిరస్మరణీయం. భారత్ తరఫున 200 టెస్టుల్లో 51 శతకాల సాయంతో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 15921 పరుగులు సాధించాడు.
అదే విధంగా.. 463 వన్డేల్లో 49 సెంచరీలు బాది 18426 పరుగులు చేశాడు. ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడిన సచిన్.. పది పరుగులు మాత్రమే చేశాడు. ఇలా మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి సచిన్ 34,357 పరుగులు సాధించాడు.
సచిన్‌ను దాటేసిన కోహ్లి.. ప్రపంచ రికార్డుకు చేరువైన రూట్
ఇక వన్డే శతకాల విషయంలో టీమిండియా లెజెండ్ విరాట్ కోహ్లి (Virat Kohli- 51) సచిన్‌ను దాటేసి.. అత్యధిక సెంచరీల వీరుడిగా అవతరించాడు. మరోవైపు.. టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ (Joe Root) సచిన్‌కు చేరువయ్యాడు. ఇటీవల టీమిండియాతో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సందర్భంగా రూట్ ఈ ఫీట్ సాధించాడు.
రూట్.. సచిన్‌ను అధిగమిస్తాడా?!
ఇంగ్లండ్ తరఫున 13379 పరుగులు సాధించిన రూట్.. సచిన్ టెండుల్కర్ కంటే ప్రస్తుతం 2378 పరుగులు మాత్రమే వెనుబడి ఉన్నాడు. 34 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మరికొన్నేళ్ల పాటు టెస్టుల్లో కొనసాగల సత్తా అతడికి ఉంది. మరి రూట్.. సచిన్‌ను అధిగమిస్తాడా?!
అతడొక గొప్ప టెస్టు ప్లేయర్..
క్రికెట్ వర్గాల్లో తరచూ నడిచే ఈ చర్చ నేపథ్యంలో సచిన్ టెండుల్కర్ రూట్‌పై తాజాగా ప్రశంసలు కురిపించాడు. అతడొక గొప్ప టెస్టు ప్లేయర్ అని కొనియాడాడు. రెడిట్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో భాగంగా సచిన్ అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా.. ‘‘జో రూట్‌పై మీకు కలిగిన తొలి అభిప్రాయం ఏమిటి? .. అతడు ఇప్పుడు టెస్టుల్లో 13000 పరుగుల మార్కు దాటేశాడు.
మీ తర్వాతి స్థానంలో ఉన్నాడు కదా!. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?’’ అనే ప్రశ్న ఎదురైంది.ఇందుకు బదులిస్తూ.. ‘‘టెస్టుల్లో 13 వేల పరుగుల మైలురాయిని దాటడం గొప్ప విజయం. అతడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 2012లో నాగ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా అతడిని తొలిసారి చూశాను.
చూడగానే కెప్టెన్ అవుతాడని చెప్పాను
అదే రూట్‌కు అరంగేట్ర మ్యాచ్. తన ఆట తీరును చూసిన తర్వాత.. ‘మీరు ఇంగ్లండ్‌కు కాబోయే కెప్టెన్‌ను చూస్తున్నారు’ అని నా సహచర ఆటగాళ్లతో చెప్పాను. అలాగే జరిగింది. అతడు ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి అయ్యాడు. అతడు వికెట్‌ను అంచనా వేసే తీరు.. స్ట్రైక్ రొటేట్ చేసే విధానం నన్ను ఆకట్టుకుంటాయి. అతడు గొప్ప టెస్టు ప్లేయర్ అవుతాడని అప్పుడే ఊహించాను’’ అని సచిన్ టెండుల్కర్ బదులిచ్చాడు.
టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరులు: టాప్-5
🏏సచిన్ టెండుల్కర్ (ఇండియా)- 15921 పరుగులు
🏏జో రూట్ (ఇంగ్లండ్)- 13379* పరుగులు
🏏రిక్కీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 13378 పరుగులు
🏏జాక్వెస్ కలిస్ (సౌతాఫ్రికా)- 13289 పరుగులు
🏏రాహుల్ ద్రవిడ్ (ఇండియా)- 13288 పరుగులు.
చదవండి: అతడు కనీసం 100 టెస్టులు ఆడాల్సింది: భారత మాజీ క్రికెటర్