
యువరాజ్ సింగ్ (Yuvraj Singh).. క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమంగా రాణించాడు యువీ. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ సాధించిన చిరస్మరణీయ విజయాల్లో అతడి పాత్ర కీలకం.
2007 టీ20 ప్రపంచకప్ (T20 World Cup), 2011 వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో ఈ ఎడమచేతి వాటం ఆటగాడు అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ప్రధానంగా నాటి వన్డే ప్రపంచకప్ టోర్నీలో యువీ దుమ్ములేపాడు.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ
ఈ ఐసీసీ ఈవెంట్లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ సింగ్ 362 పరుగులు సాధించాడు. వెస్టిండీస్‌పై సెంచరీ (113)తో రాణించిన అతడి ఖాతాలో నాలుగు ఫిప్టీలు కూడా ఉన్నాయి. అదే విధంగా.. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన యువీ ఈ టోర్నీలో పదిహేను వికెట్లు పడగొట్టాడు.
తద్వారా సొంతగడ్డపై దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత భారత్ మరోసారి వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచాడు. టీమిండియా తరఫున మొత్తంగా 304 వన్డేలు ఆడిన యువీ.. 8701 పరుగులు చేయడంతో పాటు.. 111 వికెట్లు తీశాడు.
కేవలం 40 టెస్టులు
అదే విధంగా.. 58 అంతర్జాతీయ టీ20లలో 1177 పరుగులు చేయడంతో పాటు.. 28 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ టెస్టుల్లో మాత్రం యువీకి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. కేవలం 40 టెస్టులు మాత్రమే ఆడిన అతడు 1900 పరుగులకు పరిమితమయ్యాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి.
క్యాన్సర్ బాడిన పడిన విషయం తెలిసింది
సచిన్ టెండుల్కర్, వీరేందర్ సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు భారత టెస్టు క్రికెట్‌ను ఏలుతున్న సమయంలో యువీ లైమ్‌లైట్‌లోకి రాలేదు. అయితే, గంగూలీ రిటైర్ అయిన తర్వాత టెస్టుల్లో ఛాన్స్ వచ్చినా ఆ సమయంలోనే యువీ క్యాన్సర్ బాడిన పడిన విషయం బయటపడింది.
దీంతో టెస్టు ఫార్మాట్లో వంద మ్యాచ్‌లు ఆడాలన్న యువీ కల నెరవేరలేదు. ఈ విషయం గురించి గతంలో అతడు మాట్లాడుతూ.. ‘‘దాదా రిటైర్మెంట్ తర్వాత నాకు టెస్టుల్లో ఆడే అవకాశం వచ్చింది. కానీ అప్పుడే.. నాకు క్యాన్సర్ సోకిన విషయం తెలిసింది.
నా బ్యాడ్‌లక్
అది నా దురదృష్టం. ప్రతి క్షణం భారత టెస్టు జట్టులోకి తిరిగి వచ్చి 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకునేందుకు నా శాయశక్తులా కృషి చేసినా.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను. రెండు రోజుల పాటు క్రీజులో ఉండాలని.. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవాలని నాకూ ఉండేది. కానీ అది సాధ్యపడలేదు’’ అని పేర్కొన్నాడు.
అతడు కనీసం వంద టెస్టులు ఆడాల్సింది
ఈ నేపథ్యంలో.. యువీ టెస్టు కెరీర్ గురించి భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ సెలక్టర్ సరణ్‌దీప్ సింగ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘యువరాజ్ సింగ్ మరిన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సింది. అతడు కనీసం వంద టెస్టులైనా పూర్తి చేసుకోవాల్సింది’’ అని తరువార్ కోహ్లి ఇంటర్వ్యూలో సరణ్‌దీప్ సింగ్ పేర్కొన్నాడు.