
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్ చేరింది. సూపర్-4లో తొలుత పాకిస్తాన్ (IND vs PAK)ను ఓడించిన భారత జట్టు.. బుధవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
ఈ క్రమంలో గురువారం (సెప్టెంబరు 25) జరిగే మ్యాచ్ ద్వారా మరో ఫైనలిస్టు ఖరారు కానుంది. దుబాయ్ వేదికాగా జరిగే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్- బంగ్లాదేశ్ (Pak vs Ban) చావో రేవో తేల్చుకోనున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ జాకిర్ అలీ (Jaker Ali) మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్‌పై తప్పకుండా పైచేయి సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటాం
‘‘టీమిండియాతో మ్యాచ్‌లో మా వాళ్లు మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా పది ఓవర్ల తర్వాత మా బౌలర్లు అద్భుతం చేశారు. ఈ మ్యాచ్‌లో మాకెన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటాం.
గురువారం మేము కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇందులో గెలిచి.. ఫైనల్లో ఆడాలనే కసితోనే బరిలో దిగాల్సి ఉంటుంది. మా ఆట ఎలా ఉంటుందో చూద్దాం. ఏదేమైనా అత్యుత్తమ ప్రదర్శన మాత్రం ఇస్తామని కచ్చితంగా చెప్పగలను.
పాకిస్తాన్‌పై గెలుస్తాం.. ఫైనల్లో ఆడతాం
మేము ఏ జట్టును తేలికగా తీసుకోము. మా బలాలు, సామర్థ్యాలపై పూర్తిగా దృష్టి పెడతాం. పాకిస్తాన్ గడ్డ మీద, స్వదేశంలో పాక్‌తో ఆడిన అనుభవం మాకు ఉంది. కచ్చితంగా మేము పని పూర్తి చేస్తాము’’ అని జాకిర్ అలీ పాక్‌ను ఓడించి.. టీమిండియాతో ఫైనల్ ఆడతామనే ధీమా వ్యక్తం చేశాడు.
ముఖాముఖి పోరులో పాక్‌దే పైచేయి
కాగా ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్‌లో పర్యటించిన బంగ్లా జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. పాక్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఆ తర్వాత పాక్ జూలైలో బంగ్లా పర్యటనకు రాగా.. పర్యాటక జట్టుపై బంగ్లాదేశ్ 2-1తో గెలిచి టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే.. టీమిండియాతో ఆసియా కప్ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ లిటన్ దాస్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో 27 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ జాకిర్ అలీ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.
ఇక టీ20 ఫార్మాట్లో బంగ్లాదేశ్- పాకిస్తాన్ ఇప్పటి వరకు 25సార్లు ముఖాముఖి తలపడగా.. పాక్ 20, బంగ్లాదేశ్ ఐదు సార్లు విజయం సాధించాయి.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు
👉భారత్: 168/6 (20)
👉బంగ్లాదేశ్: 127 (19.3)
👉ఫలితం: బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో భారత్
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75)
చదవండి: BCCI: అభిషేక్ శర్మకు బంపరాఫర్!