సింధు శుభారంభం | Badminton Asia Championships 2025 | Sakshi
Sakshi News home page

సింధు శుభారంభం

Apr 10 2025 9:46 AM | Updated on Apr 10 2025 11:40 AM

Badminton Asia Championships 2025

నింగ్బో (చైనా): భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్‌ వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్‌ సింధు 21–15, 21–19తో ప్రపంచ 36వ ర్యాంకర్‌ ఎస్తర్‌ నురుమి వొర్డోయో (ఇండోనేసియా)పై గెలిచింది. 44 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేమ్‌ల్లో విజృంభించిన సింధు... 

19 ఏళ్ల ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. గురువారం జరగనున్న ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 14–11తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది. ఇతర మ్యాచ్‌ల్లో ఆకర్షి కశ్యప్, అనుపమ, మాళవిక ఓటమి పాలై ఇంటిదారి పట్టారు. ఆకర్షి 13–21, 7–21తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ హాన్‌ యూ (చైనా) చేతిలో... అనుపమ 13–21, 14–21తో ప్రపంచ 13వ ర్యాంకర్‌ రచనోక్‌ ఇంతనోన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో... మాళవిక 14–21, 8–21తో గావ్‌ ఫెంగ్‌ జై (చైనా) చేతిలో ఓడారు. 

ప్రిక్వార్టర్స్‌లో కిరణ్, ప్రియాన్షు... 
పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్‌ ఆటగాళ్లు లక్ష్యసేన్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలవగా... కిరణ్‌ జార్జి, ప్రియాన్షు రజావత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. తొలి రౌండ్‌లో లక్ష్యసేన్‌ 18–21, 10–21తో లీ చయ్‌ హౌ (చైనీస్‌ తైపీ) చేతిలో... ప్రణయ్‌ 16–21, 21–12, 11–21తో జూ గువాంగ్‌ లూ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. కిరణ్‌ జార్జి 21–16, 21–8తో దిమిత్రి పనారిన్‌ (కజకిస్తాన్‌)పై, ప్రియాన్షు 20–22, 21–12, 21–10తో వాంగ్‌చరోయెన్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించారు.

 మహిళల డబుల్స్‌లో ప్రియా–శ్రుతి మిశ్రా జోడీ 11–21, 13–21తో షూ యెన్‌ సంగ్‌–చైన్‌ హుయి యూ (చైనా) జంట చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో హరిహరన్‌–రూబన్‌ ద్వయం 21–3, 21–12తో మధుక దులంజన–లహిరు వీరసింఘే (శ్రీలంక) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించగా... పృథ్వీ–సాయి ప్రతీక్‌ జంట 19–21, 12–21తో చై సియాంగ్‌ చైవాంగ్‌ చీ లిన్‌ (చైనా) ద్వయం చేతిలో ఓడి టోర్నీ నుంచి ని్రష్కమించింది.

Advertisement
 
Advertisement
Advertisement