బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌లకు షాక్‌.. అకౌంట్లు బ్లాక్‌ | Babar Azam Mohammad Rizwan Instagram Accounts Blocked in India Reason is | Sakshi
Sakshi News home page

బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌లకు షాక్‌.. అకౌంట్లు బ్లాక్‌

May 2 2025 6:53 PM | Updated on May 2 2025 7:16 PM

Babar Azam Mohammad Rizwan Instagram Accounts Blocked in India Reason is

పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్‌ కఠిన చర్యలు చేపట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా దాయాదిపై అనేక ఆంక్షలు విధించింది. అదే విధంగా పాకిస్తాన్‌కు చెందిన సామాజిక మాధ్యమాల ఖాతాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే పాక్‌ యూట్యూబ్‌ చానెళ్లు, ట్విటర్‌ను నిషేధించిన భారత్‌.. క్రీడాకారుల సోషల్‌ మీడియా అకౌంట్లపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జావెలిన్‌ త్రోయర్‌, ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024 స్వర్ణ పతక విజేత అర్షద్‌ నదీమ్‌ (Arshad Nadeem) ఖాతాను దేశంలో నిలిపివేసింది.

బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌లకు షాక్‌
ఇక పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్లు బాబర్‌ ఆజం (Babar Azam), కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (Mohammed Rizwan)లకు కూడా తాజాగా షాక్‌ తగిలింది. వీరిద్దరి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను భారత్‌లో నిలిపి వేశారు.  వీరి అకౌంట్లను ఓపెన్‌ చేయాలని చూస్తే.. ‘‘ఈ అకౌంట్‌ ఇండియాలో అందుబాటులో లేదు. చట్టపరమైన అభ్యర్థనల నేపథ్యంలో దీనిపై ఆంక్షలు ఉన్నాయి’’ అనే సందేశం కనిపిస్తోంది.

కాగా పహల్గామ్‌ దాడి తర్వాత షోయబ్‌ అక్తర్‌, షాహిన్‌ షా ఆఫ్రిది, హ్యారిస్‌ రవూఫ్‌, షాహిద్‌ ఆఫ్రిది, వసీం అక్రం, వకార్‌ యూనిస్‌, బసిత్‌ అలీ తదితర క్రికెటర్ల అకౌంట్లను కూడా భారత్‌లో బ్లాక్‌ చేశారు. అదే విధంగా ఇతర సెలబ్రిటీలు మహీరా ఖాన్‌, ఫవాద్‌ ఖాన్‌, అలీ జాఫర్‌, హనియా ఆమిర్‌ ఖాతాలను కూడా నిలిపివేశారు.

భారత్‌లో నిషేధం
ఇక పాకిస్తాన్‌ ఆటగాళ్లు ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌తో బిజీగా ఉన్నారు. ఐపీఎల్‌-2025తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పాక్‌ క్రికెట్‌ బోర్డుకు.. పహల్గామ్‌ దాడి తర్వాత మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అంతంత మాత్రమైన వ్యూయర్‌షిప్‌ ఉన్న ఈ లీగ్‌ ప్రసారాలను భారత్‌లో నిషేధించారు.

కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల ప్రశాంతమైన బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు ఇటీవల పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే. బైసరన్‌ అందాలు చూసేందుకు వచ్చిన 26 మంది పర్యాటకులను కాల్చి చంపేశారు. దీంతో... అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇస్తున్న వారిపై భారత్‌ కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా దాయాదికి బుద్ధిచెప్తోంది.

చదవండి: ఆసియా కప్‌, బంగ్లాదేశ్‌ పర్యటనను రద్దు చేసుకోనున్న టీమిండియా..?

Advertisement
 
Advertisement
Advertisement