పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ తన రెండున్నర ఏళ్ల సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. శనివారం రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బాబర్ అజేయ శతకంతో చెలరేగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 807 రోజులు, 83 మ్యాచ్‌ల తర్వాత బాబర్ సాధించిన సెంచరీ ఇది.
289 పరుగుల లక్ష్య చేధనలో అజామ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 119 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సైమ్ అయూబ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్.. ఫఖర్ జమాన్ (78 పరుగులు)తో కలిసి రెండో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్ (51 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు 111 పరుగుల మ్యాచ్-విన్నింగ్ పార్టనర్‌షిప్‌ను నమోదు చేశాడు. దీంతో లంకపై 8 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో సెంచరీతో సత్తాచాటిన బాబర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
అన్వర్ రికార్డు సమం..
అంతర్జాతీయ క్రికెట్‌లో పాక్ తరపున అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన నాలుగో ప్లేయర్‌గా బాబర్ నిలిచాడు. బాబర్‌కు ఇది ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 32వ సెంచరీ. ఈ క్రమంలో జావేద్ మియాందాద్(31), సయీద్ అన్వర్(31)లను అధిగమించాడు. ఈ జాబితాలో యూనిస్ ఖాన్(41) అగ్రస్ధానంలో ఉన్నాడు.
అదేవిధంగా పాక్ తరపున అత్యధిక వన్డే సెంచరీలు ఆటగాడిగా యీద్ అన్వర్ రికార్డును అజామ్ సమం చేశాడు. అన్వర్ తన వన్డే కెరీర్‌లో 20 సెంచరీలు చేయగా.. బాబర్ కూడా ఇప్పటివరకు సరిగ్గా 20 శతకాలు నమోదు చేశాడు. మరో సెంచరీ చేస్తే అన్వర్‌ను ఈ మాజీ కెప్టెన్ అధిగమిస్తాడు.
అప్పుడు కోహ్లి.. ఇప్పుడు బాబర్
బాబర్ ఆజం లానే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ కోసం 83 ఇన్నింగ్స్‌లు ఆగాల్సి వచ్చింది. సెంచరీలను మంచినీళ్లప్రాయంగా సాధించే కోహ్లి.. దాదాపు రెండేన్నరేళ్ల పాటు మూడెంకెల ఫిగర్‌ను అందుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు.
కోహ్లి 2019 నవంబర్ 23న సెంచరీ చేస్తే.. ఆ తర్వాత మళ్లీ 2022 సెప్టెంబర్ 8న మళ్లీ శతక్కొట్టాడు. ఇప్పుడు బాబర్ కూడా 2023 ఆగస్టు 30న చివరి సారిగా సెంచరీ చేయగా, మళ్లీ 807 రోజుల తర్వాత అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
చదవండి: IPL 2026: కావ్య మారన్ సంచలన నిర్ణయం..?


