Photo Credit: Twitter
సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు కోల్పోయిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు ముందు జరుగుతున్న సన్నాహక మ్యాచ్‌లో మాత్రం అదరగొడుతుంది. టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా క్రికెట్ సౌతాఫ్రికా ఇన్విటేషన్ ఎలెవెన్‌తో రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. కాగా మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ 76 బంతుల్లోనే సెంచరీ సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.
లబుషేన్ ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 2 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (21) క్రీజులో ఉన్నాడు. అంతకముందు ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (22), మాట్ రెన్ షా (32) పరుగులు సాధించారు. ఇక క్రికెట్ సౌతాఫ్రికా ఎలెవెన్ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 318 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
నీల్ బ్రాండ్ (152) సెంచరీతో చెలరేగాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, హాజిల్‌వుడ్, మైకెల్ నాసర్, మాథ్యూ కుహెన్‌మన్, కూపర్ కన్నోలి, బ్యూ వెబ్‌స్టర్‌లు తలా ఒక వికెట్ తీశారు. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు అక్టోబర్ 9 నుంచి డర్బన్ వేదికగా జరగనుంది. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా విజయం సాధించగా, మూడో వన్డేలో ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజయం సాధించి క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. వచ్చే ఏడాది ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ నేపథ్యంలో జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ వన్డే సిరీస్‌లో కేవలం ఒక్క మ్యాచ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు.
ఇదీ చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు పాక్ సీనియర్ గుడ్‌బై


