జపాన్‌ గుండె చప్పుడు | Asian Games 2026 Open With Grand Ceremony in Japan | Sakshi
Sakshi News home page

జపాన్‌ గుండె చప్పుడు

Sep 20 2026 5:16 AM | Updated on Sep 20 2026 5:16 AM

Asian Games 2026 Open With Grand Ceremony in Japan

ఘనంగా ఆసియా క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు

పారిశ్రామిక ప్రగతి, సంస్కృతి మిశ్రమ ప్రదర్శన 

నేటి నుంచి ప్రధాన పోటీలు

ఆసియా క్రీడల ఆరంభం సంబరం అద్భుతంగా సాగింది... తమ దేశ సంస్కృతి ప్రదర్శన మాత్రమే కాకుండా పారిశ్రామిక ప్రగతిలో తమ ఘనతను చూపిస్తూ జపాన్‌ ఈ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా ప్రదర్శించింది. ప్రముఖ దర్శకుడు యుకిహికు సుసుమి నేతృత్వంలో రూపొందిన ఈ ప్రత్యేక కార్యక్రమం అన్ని రకాలుగా అలరించింది. రంగులు, హంగులతో మిరుమిట్లుగొలిపిన కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. 

క్రీడల్లో పాల్గొంటున్న వేర్వేరు దేశాల ఆటగాళ్ల మధ్య బంధాన్ని చూపేలా ‘హృదయాన్ని’ నేపథ్యంగా ఎంచుకున్న నిర్వాహకులు కార్యక్రమం ఆసాంతం దాన్ని ప్రతిఫలిస్తూ వినూత్న తరహాలో వేడుకలను ప్రపంచం ముందు ఉంచడం విశేషం. శనివారం మిజుహో పార్క్‌ అథ్లెటిక్‌ స్టేడియంలో సుమారు రెండు గంటల పాటు సాగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైలైట్స్‌ను చూస్తే...

అలా సాగింది... 
ప్రారంభోత్సవ కార్యక్రమం జపాన్‌ జాతీయగీతంతో మొదలైంది. ఆ తర్వాత ఆ దేశ రక్షణ దళానికి చెందిన సైనికులు జపాన్‌ జాతీయ పతాకాన్ని స్టేడియంలోకి తీసుకొచ్చారు. ఐషీ రాష్ట్రంలో పర్యాటకపరంగా ఎంతో గుర్తింపు ఉన్న ‘నగోయా క్యాజిల్‌’ నమూనాను స్టేడియం మధ్యలో ప్రదర్శిస్తూ కార్యక్రమాలను నిర్వహించారు. ఆతిథ్య దేశానికి చెందిన ప్రముఖ వయోలినిస్ట్‌ టారో హకాసే తన సంగీత ప్రావీణ్యాన్ని ప్రదర్శించగా, నాలుగు భిన్నమైన రంగులతో 240 మంది డాన్సర్లు చేసిన ప్రత్యేక సంగీత కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. 

జపాన్‌ చారితక్ర, సాంస్కృతిక ‘కబూకీ’ ప్రదర్శన సమయంలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచి్చంది. ప్రఖ్యాత మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘ఐఎన్‌ఐ మ్యూజిక్‌ గ్రూప్‌’ కూడా తమ ప్రదర్శనతో అలరించింది. ఈ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్న 43 క్రీడాంశాలకు చెందిన ఆడియో విజువల్‌ షోను కూడా ప్రదర్శించారు. కుటుంబ సమేతంగా హాజరైన జపాన్‌ రాజు నరుహిటో అధికారికంగా క్రీడలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలు క్రిస్టీ కొవెంట్రీ తదితరులు పాల్గొన్నారు.

తండ్రీ కొడుకులు కలిసి... 
ఆసియా క్రీడల జ్యోతిని ఇద్దరు జపాన్‌ స్టార్‌ ఆటగాళ్లు కలిసి వెలిగించారు. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్‌ క్రీడల హ్యామర్‌ త్రోలో స్వర్ణం సాధించిన మురోఫుషు కోజి, అతని తండ్రి షిగెనొబు కలిసి ఈ లాంఛనం పూర్తి చేశారు. షిగెనొబు కూడా హ్యామర్‌త్రోలనే ఆసియా క్రీడల్లో ఐదు స్వర్ణాలు గెలుచుకున్నాడు.  

 46 జట్ల పరేడ్‌... 
ప్రారంభోత్సవంలో జరిగిన మార్చ్‌పాస్ట్‌లో మొత్తం 45 దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. వీటితో పాటు నలుగురు సభ్యుల ఆసియా రెఫ్యూజీ టీమ్‌ కూడా పరేడ్‌లో భాగమైంది. ఆసియా క్రీడల్లో రెఫ్యూజీ జట్టు పాల్గొనడం ఇదే తొలిసారి. అక్షర క్రమంలో అఫ్గానిస్తాన్‌ జట్టు అందరికంటే ముందుగా రాగా, సంప్రదాయాన్ని అనుసరించి ఆతిథ్య జట్టు జపాన్‌ అన్నింటికంటే ఆఖరిగా వచి్చంది. జపాన్‌ తరఫున 900 మందికి పైగా అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటుండటం విశేషం.
 

అంతా హృదయమయం...
ఆసియా క్రీడల థీమ్‌ హార్మోనిక్‌ ‘హార్ట్‌’ బీట్‌... వేదికపై పెద్ద సైజులో ‘హార్ట్‌’ నమూనా ఏర్పాటు...స్వాగత సంగీతం పేరు అవేకనింగ్‌ ఆఫ్‌ ద స్పేస్‌ అండ్‌ రెజొనేటింగ్‌ ‘హార్ట్‌’ బీట్‌... మార్చ్‌పాస్ట్‌లో వివిధ దేశాల పేర్ల ప్లకార్డ్‌లు కూడా ‘హార్ట్‌’ రూపంలోనే...సంగీత కచేరీ చేస్తున్న వయోలినిస్ట్‌ వేసుకున్న దుస్తులపై కూడా గుండె గుర్తులే... డ్రోన్‌ షోలో ఏంజెల్స్‌ రెక్కలూ అదే ఆకారంలో... ఇలా ఆసియా క్రీడల నిర్వాహక బృందం అన్ని చోట్లా  హృదయాన్ని నింపేసింది. కబుకీ ప్రదర్శనలోనూ ‘హార్ట్‌’ బీట్‌ ఆఫ్‌ ట్రెడిషన్‌ అంటూ పరిచయం జరిగింది. ఆటగాళ్ల మధ్య అనుబంధం, ఏకత్వం, స్నేహం పెంపొందించడమే క్రీడల లక్ష్యమంటూ పదే పదే గుర్తు చేసేలా ఈ కార్యక్రమ రూపకల్పన జరగడం విశేషం.

సాంకేతిక సత్తా చూపిస్తూ... 
ప్రఖ్యాత మోటో కార్ప్‌ కంపెనీ టయోటా ప్రధాన కార్యాలయం ఈ క్రీడలు జరుగుతున్న ఐషీ రాష్ట్రంలోనే ఉంది. అలాంటప్పుడు దాని ప్రాధాన్యతను గురించి చెప్పకపోతే ఎలా! క్రీడల నిర్వాహకులు కూడా అదే తరహాలో ఆలోచించారు. అందుకే ‘హార్మొనీ కనెక్టింగ్‌ టు ద ఫ్యూచర్‌’ పేరుతో తమ సాంకేతిక పురోగతిని ప్రదర్శించారు. ఐషీలో ఉన్న ఉత్పాదక కంపెనీలు, అవి తయారు చేసే వస్తువులువంటి అంశాలను తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభమైన తమ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో, ఎప్పటికిప్పుడు కొత్త ఉత్పాదనలతో భవిష్యత్తు కోసం ఎలా తాము దూసుకు పోతున్నామో ఇందులో వివరించారు.

మనూ, పవన్‌ పతాకధారులుగా...
మార్చ్‌పాస్ట్‌లో భారత బృందానికి యువ షూటర్‌ మనూ భాకర్, కబడ్డీ ఆటగాడు పవన్‌ సెహ్రావత్‌ నేతృత్వం వహించారు. ఈ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన నీలం రంగు డిజైనర్‌ డ్రెస్‌లలో భారత అథ్లెట్లు మెరిశారు. బంద్‌గలాతో కూడిన ఆకర్షణీయమైన చీరలను మహిళా అథ్లెట్లు ధరించగా, అదే తరహాలో సిద్ధం చేసిన జోధ్‌పురి డ్రెస్‌లో పురుష క్రీడాకారులు పాల్గొన్నారు. పతాకధారుల విషయంలో చివరి నిమిషంలో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. మనూ భాకర్‌తో పాటు షాట్‌పుటర్‌ తజీందర్‌పాల్‌ సింగ్‌ ఫ్లాగ్‌ బేరర్‌గా వ్యవహరించాల్సి ఉండగా...అతని స్థానంలో పవన్‌ వచ్చాడు. ఓపెనింగ్‌ సెరెమనీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్‌ తజీందర్‌కు అందకపోవడంతో మార్పు తప్పలేదు. తజీందర్‌ మాత్రమే కాకుండా భారత అథ్లెటిక్స్‌ బృందంలో ఎవరికీ ప్రారంభోత్సవ కిట్‌ అందలేదు. దాంతో 75 మంది భారత ఆటగాళ్లు కూడా ఈ కార్యక్రమానికి దూరమయ్యారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement