
ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు టోర్నీ
విజేత జట్టుకు ప్రపంచకప్ బెర్త్
న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి తదనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కాస్తా యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. చివరకు కాల్పుల విరమణతో భారత్ వైపు నుంచి ప్రతిదాడులు తప్పినా... పాక్ నుంచి చీకటి పడగానే డ్రోన్ల దాడి ఎదురవుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ హాకీ జట్టును కేంద్ర ప్రభుత్వం అనుమతించే అవకాశాలే లేవు. దీనిపై హాకీ ఇండియా (హెచ్‌ఐ) భారత ప్రభుత్వ సలహా కోరగా... ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన రాలేదు. ఆగస్టు 27 నుంచి సెపె్టంబర్ 7 వరకు బిహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరగనుంది. ఇందులో ఆతిథ్య భారత్ సహా జపాన్, కొరియా, చైనా, మలేసియా, ఒమన్, చైనీస్ తైపీ, పాకిస్తాన్ పోటీపడతాయి. ప్రపంచకప్ హాకీకి ఈ ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీగా జరుగుతోంది. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమివ్వబోతున్న ప్రపంచకప్ హాకీ టోర్నీ వచ్చే ఏడాది జరుగుతుంది.
భారత్‌లో జరిగే టోర్నీ కోసం పాక్‌ను అనుమతించకపోవడం గతంలోనూ జరిగింది. 2016లో పఠాన్‌కోట్‌లో భారత ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి జరగడంతో ఆ ఏడాది జరిగిన జూనియర్ ప్రపంచకప్ హాకీలో పాక్‌కు అనుమతించలేదు. ఏదేమైనా ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోళానాథ్ సింగ్ చెప్పారు.
అనుమతిస్తారా, నిరాకరిస్తారా అన్నది ప్రభుత్వం చేతుల్లో ఉందని, దీనిపై ముందస్తుగా తాము చెప్పడానికేమీ లేదని ఆయన చెప్పారు. ఆసియా టోర్నీలో పాక్ స్థానంలో మలేసియాను ఆడించే అవకాశమైంది. ఈ టోర్నీలో ఐదుసార్లు విజేత అయిన దక్షిణ కొరియా డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగుతుంది. కొరియా తర్వాత దాయాది దేశాలు చెరో నాలుగుసార్లు ఆసియా కప్ గెలిచాయి.