
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి టైటిల్ పోరులో దాయాదులు భారత్- పాకిస్తాన్ (IND vs PAK) తలపడనున్నాయి. లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-4కు చేరింది టీమిండియా.
అదే విధంగా.. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై విజయం సాధించింది. తద్వారా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో గెలిచి అజేయంగా ఫైనల్లో తలపడేందుకు సిద్ధమైంది. మరోవైపు.. పాకిస్తాన్ లీగ్ దశలో యూఏఈ, ఒమన్‌లపై గెలిచి సూపర్-4 చేరగలిగింది.
పాకిస్తాన్ బలహీనంగానే
తర్వాత సూపర్-4లో శ్రీలంక, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లలో గట్టెక్కడం ద్వారా ఎట్టకేలకు ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే, టీమిండియాతో పోలిస్తే అన్ని రంగాల్లో పాకిస్తాన్ బలహీనంగానే కనిపిస్తోంది. తమ చివరి సూపర్–4 మ్యాచ్‌లో కూడా బంగ్లాదేశ్‌తో దాదాపు ఓటమికి చేరువై అదృష్టవశాత్తూ తప్పించుకోగలిగింది.
ఇక భారత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా టీమ్ ప్రదర్శన పేలవంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కూడా చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కనిపించడం లేదు. 160 పరుగులతో టీమ్ టాప్ స్కోరర్‌గా ఉన్న ఫర్హాన్ ఒక్క మ్యాచ్‌లో అర్ధ సెంచరీ మినహా ప్రభావం చూపలేదు.
సయీమ్ విఫలమైనా.. జట్టులోనే
ఫఖర్ జమాన్ (Fakhar Zaman) తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోగా... మిగతా ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించలేదు. ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను చేసింది 64 పరుగులే. ‘పాక్ అభిషేక్ శర్మ’ అంటూ కొన్నాళ్ల క్రితం కీర్తించిన సయీమ్ అయూబ్ ఏకంగా రికార్డు స్థాయిలో 4 డకౌట్‌లతో ఘోర ప్రదర్శన కనబర్చాడు.
అయితే మరో చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయం కూడా లేదు కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ అతని స్థానంపై ఎలాంటి ఢోకా లేదు. వీరందరిలో తుది పోరులో ఎవరు రాణిస్తారనేది చూడాలి. పాక్ సాధారణ స్కోరు నమోదు చేయాలన్నా మిడిలార్డర్‌లో తలత్, హారిస్‌లు కనీస ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.
బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిది ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించినా... భారత్ ఓపెనర్లు అతడిని అలవోకగా ఎదుర్కొంటున్నారు. రవూఫ్, అబ్రార్, ఫహీమ్, నవాజ్ మన బ్యాటర్లనను అడ్డుకోవడం అంత సులువు కాదు.
పిచ్, వాతావరణం
దుబాయ్‌లో సాధారణ వికెట్. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌కు కూడా అనుకూలం. అయితే రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయని పదే పదే రుజువైంది. కాబట్టి టాస్ గెలిచిన టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం
ముఖాముఖి పోరులో..
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య వన్డే, టీ20లు కలిపి ఇప్పటి వరకు పన్నెండు ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ నాలుగు గెలవగా... పాకిస్తాన్ ఎనిమిది ఫైనల్‌లలో విజయం సాధించింది.
తుదిజట్ల వివరాలు అంచనా:
టీమిండియా:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
పాకిస్తాన్
సల్మాన్ ఆఘా (కెప్టెన్ ), సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సయీమ్ అయూబ్, హొసేన్ తలత్, మొహమ్మద్ హ్యారిస్, షాహిన్ అఫ్రిది, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
చదవండి: Asia Cup Ind vs Pak: ఆఖరి పోరాటం