నాలుగేళ్ల క్రితం కాలం విసిరిన బౌన్సర్‌కు ఆ యంగ్ బౌలర్ జీవితం బౌల్డ్ అయింది. క్రికెటర్ కావాలన్న అతడి కలను కరోనా రూపంలో బ్రేక్ పడింది. అయితే అతడు ఆగిపోలేదు. సంకల్ప శుద్ధితో అడ్డంకులను అధిగమించి తన లక్ష్యానికి చేరువయ్యాడు. ప్రస్తుతం భారత్ తరపున అండర్-19 జట్టులో చోటు దక్కించుకుని ముందుకు సాగుతున్నాడు. ఆ యంగ్ క్రికెటర్ పేరు అశుతోష్ మహిద.
గుజరాత్‌లోని బరోడా (Baroda) చెందిన 18 ఏళ్ల అశుతోష్ చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలనుకున్నాడు. అతడి తండ్రి చిరాగ్ మహిద ప్రోత్సాహంతో 9వ ఏటనే క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న చిరాగ్.. తన కొడుకు కలను సాకారం చేయాలని గట్టిగా అనుకున్నాడు. అనుకోవడంతోనే ఆగకుండా కార్యాచరణకు దిగాడు. అశుతోష్‌ను హింద్ విజయ్ జింఖానా క్రికెట్ కోచింగ్ సెంటర్‌లో చేర్పించాడు. తర్వాత కొద్ది రోజులకే ఫాస్ట్ బౌలింగ్ చేయడం నేర్చుకుని రైట్ ఆర్మ్ పేసర్‌గా మారాడు. కోచ్ దిగ్విజయ్ రథ్వా చెప్పిన పాఠాలు ఒంటబట్టించుకుని మరింత రాటుదేలాడు.
కరోనాతో కుదేలు..
అంతా సాఫీగానే సాగుతుందన్నకుంటున్న సమయంలోనే కరోనా విపత్తు (corona pandemic) అతడి జీవితాన్ని తలకిందులు చేసింది. క్రికెటర్ కావాల్సిన వాడు కాస్తా కూరగాయలు అమ్మాల్సివచ్చింది. కరోనా కారణంగా అతడి తండ్రికి జీవనోపాధి లేకపోవడంతో కూరగాయలు విక్రయించాడు. తండ్రికి తోడుగా అశుతోష్ కూడా కూరగాయలు అమ్మాడు. కరోనా రాక ముందు వరకు మా జీవితం సాఫీగానే సాగింది. కరోనా సమయంలో లాక్‌డౌన్ విధించడంతో మా నాన్నకు పని లేకుండా పోయింది. కుటుంబాన్ని పోషించుకోవడానికి కూరగాయలు అమ్మాల్సి వచ్చింది.
''ఆ రోజులు చాలా భారంగా గడిచాయి. నేను మాత్రం క్రికెటర్ కావాలన్న నా కలను వదులుకోలేదు. నాన్నకు సాయం చేస్తూనే క్రికెట్ కొనసాగించాను. అంతటి గడ్డు పరిస్థితుల్లోనూ నన్నెంతో ప్రోత్సహించారు మా నాన్న. కరోనా ముగిసిన తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగుపడ్డాయి. ఇప్పుడు నాన్న కొరియోగ్రాఫర్‌గా తన పని కొనసాగిస్తున్నారు. మా నాన్నను క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను క్రికెటర్ అవుతానంటే ఎంతోగానో ప్రోత్సహించార''ని అశుతోష్ మహిద ( Ashutosh Mahida) చెప్పాడు.
హైదరాబాద్‌లో ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్
కరోనా తర్వాత నుంచి అశుతోష్‌కు మంచి రోజులు వచ్చాయి. 2022లో ఇంటర్ క్లబ్ టోర్నమెంట్లు ఆడడంతో పాటు బరోడా అండర్ -16 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 2024లతో విజయ్ మర్చంట్ ట్రోఫీలోనూ ఆడాడు. కూచ్ బెహర్ ట్రోఫీలో అండర్-19 టీమ్ తరపున బరిలోకి దిగి ఐదు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. గత రెండేళ్లలో పలుమార్లు గాయాల బారిన పడినా కోలుకుని బౌలర్‌గా రాణిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన అండర్-19 వన్డే చాలెంజర్ ట్రోఫీలోనూ ఆడాడు. ''ఇది నా మొదటి అంతర్జాతీయ టోర్నమెంట్, కానీ నేను భయపడలేదు. నా జట్టు గెలవడానికి సహాయం చేయడమే నా లక్ష్యమ''ని అశుతోష్ చెప్పాడు.
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ (ICC U-19 World Cup) సన్నాహాల్లో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ ఎక్స్‌లెంట్ సెంటర్‌లో ప్రస్తుతం జరుగుతున్న యూత్ ట్రయాంగులర్ సిరీస్‌లో అశుతోష్ ఆడుతున్నాడు. ఇక్కడ గనక అతడు అద్భుతంగా రాణిస్తే అండర్-19 వన్డే వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. కాగా, జింబాబ్వే, నమీబియాలో.. జనవరి-ఫిబ్రవరిలో పురుషుల అండర్-19 వన్డే ప్రపంచకప్ జరగనుంది.
బ్యాటర్లను భయపెడతాడు: కోచ్
అశుతోష్ మహిదకు మంచి భవిష్యత్తు ఉందని అతడికి శిక్షణ ఇచ్చిన మోతీబాగ్ క్రికెట్ క్లబ్ కోచ్ దిగ్విజయ్ రథ్వా (Digvijay Rathwa) తెలిపారు. పదునైన బౌలింగ్‌తో ఈ యువ పేసర్ బ్యాటర్లను భయపెట్టగలడని అన్నారు. "గత సంవత్సరం హెచ్‌డి జవేరి లీగ్‌లో రిలయన్స్ జట్టుపై అశుతోష్ ఏడు ఓవర్ల బౌలింగ్ స్పెల్ మొత్తం ఆటను మార్చివేసింది. మహిద తన స్పెల్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి మోతీబాగ్ జట్టును విజయపథంలో నడిపించాడు. తన బౌలింగ్‌తో బ్యాటర్లను భయపెట్టగలడు. అతడు చాలా దూరం వెళ్తాడు" అని అన్నారు.


