
టాంగ్ జియాన్ (ఫొటో: సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్)
చైనా వ్యాపారవేత్త ఇన్‌స్పైరింగ్ జర్నీ
మనిషి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. హీరో అనుకున్న వారు జీరో కావొచ్చు. ఎందుకూ పనికిరారు అనుకున్నవారు ఎవరూ ఊహించని విధంగా పైకి ఎదగవచ్చు. శిఖరం చేరిన వారు పాతాళానికి పడిపోవచ్చు. ఇలాంటి వారిలో మళ్లీ పైకి లేచేవారూ ఉంటారు. జీవితాన్ని మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టి ముందుకెళ్లడానికి ఏమాత్రం సంకోచించరు. అలాంటి ఓ వ్యాపారవేత్త గురించి మనం తెలుసుకుందాం. అయితే ఆయన మనదేశానికి చెందిన వాడు కాదు. స్ఫూర్తి పొందడానికి ఎక్కడివారైతే ఏంటి?
చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!
చనాకు చెందిన 57 ఏళ్ల టాంగ్ జియాన్ 2000 సంవత్సరం ప్రాంతంలో నెలకు మూడు మిలియన్ యువాన్ల (ప్రస్తుత రేటు ప్రకారం సుమారు ₹3.7 కోట్లు) వరకు సంపాదించేవాడు. తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని తీరప్రాంత నగరమైన కింగ్‌డావోలో (Qingdao) మూడు ప్రసిద్ధ రెస్టరెంట్లు, బార్లు ఉండేవి. జీవితంగా సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో ఊహించని మలుపు తిరిగింది. తెలియని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి టాంగ్ జియాన్ చేతులు కాల్చుకున్నాడు. త్వరగా సంపాదించాలన్న దురాశతో సొంత డబ్బుతో పాటు ఇతరులను నుంచి అప్పులు తీసుకుని మరీ పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయాడు. ఫలితంగా 2015 నాటికి రూ. 57 కోట్లు అప్పులతో దివాళా తీశాడు.
వీధి దుకాణంతో రీస్టార్ట్
వ్యాపారంలో సర్వం కోల్పోవడంతో అతడి జీవితం తలకిందులైంది. రెస్టరెంట్లను మూసివేశాడు. ఆస్తులు మొత్తం అమ్మినా అప్పులు తీరలేదు. భార్యతో తరచుగా గొడవ పడేవాడు. దీంతో భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయింది. ఊహించని విధంగా ఒడిదుడుకులు ఎదురు కావడంతో ఎందుకు బతకాలన్న ఆలోచనలు వెంటాడేవి. అయితే తనపై ఆధారపడిన అమ్మ, కన్నబిడ్డ గుర్తుకు రావడంతో ఎలాగైనా జీవితాన్ని ఈదాలని అనుకున్నాడు. 2018లో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. పాత రెస్టరెంట్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ స్టాల్ (street food stall) స్టార్ట్ చేశాడు. ఇంట్లో తయారుచేసిన సాసేజ్‌లను అక్కడ అమ్మడం ప్రారంభించాడు. 74 ఏళ్ల తల్లి అతడికి సహాయం చేసేది.
ఒకప్పుడు బాగా బతికిన టాంగ్ జియాన్ (Tang Jian) చివరికి వీధి దుకాణం పెట్టుకోవాల్సి రావడంతో న్యూనతకు గురయ్యాడు. తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ ధరించేవాడు. అయితే పొరుగున ఉండే వారిలో ఒకరు అతడిని గుర్తు పట్టడంతో ముఖం దాచుకోవడం మానేశాడు. ధైర్యంగా తన వ్యాపారంపై దృష్టి పెట్టాడు. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగాడు. చేతితో తయారు చేసిన నాణ్యమైన సాసేజ్‌లను తక్కువ ధరకు విక్రయించడంతో అతడి వ్యాపారం దినదినాభివృద్ధి సాధించింది. రోజుకు 2 టన్నుల సాసేజ్‌లను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు టాంగ్ జియాన్ రోజుకు దాదాపు 200,000 యువాన్లు (₹25 లక్షలు) సంపాదిస్తున్నాడు. పలు షాపింగ్ సెంటర్లలో అతడి అవుట్‌లెట్‌లు ఉన్నాయి.
కోవిడ్ దెబ్బ కొట్టినా..
సంకల్పం గట్టిగా ఉంటే శిఖరస్థాయికి నుంచి కిందకు పడిపోయినా మళ్లీ పైకి లేవొచ్చని టాంగ్ జియాన్ దీమాగా చెబుతున్నాడు. కోవిడ్-19 (Covid-19) సమయంలో వ్యాపారం మందగించడంతో డిజిటల్ బాట పట్టాడు. ఆన్‌లైన్ అమ్మకాలతో దాదాపు 12 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. తాజాగా కృత్రిమ మేధస్సు సహాయంతో తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నాడు. ఒక సెషన్‌లో మిలియన్ యువాన్ (₹1.25 కోట్లు) విలువైన వ్యాపారం చేసే స్థాయికి చేరుకున్నాడు. 2027 నాటికి అప్పులన్నీ తీర్చేయాలన్న లక్ష్యంతో అతడు ముందుకు సాగుతున్నాడు.
స్ఫూర్తిదాయకం
టాంగ్ జియాన్ ప్రస్థానాన్ని 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' ప్రచురించింది. దీన్ని చదివిన పాఠకులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడాలని టాంగ్ జీవితం బోధిస్తోందని పేర్కొంటున్నారు. ఉన్నత స్థానం నుంచి కిందకు పడిపోయినా పట్టుదలతో పోరాడిన టాంగ్ జీవితం స్ఫూర్తిదాయకమని (inspiring) అంటున్నారు. సంకల్పం, సహనంతో అనుకున్నది సాధించవచ్చని టాంగ్ మరోసారి రుజువు చేశాడని మెచ్చుకుంటున్నారు.
చదవండి: డొనాల్డ్ ట్రంప్ నాణెంపై వివాదం