
జీవితం అందరికీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎత్తుపల్లాలు.. ఒడిదుడుకులు ఉంటాయి. ఒక్కోసారి నిచ్చెనెక్కించి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కొన్నిసార్లు ఊహించని విధంగా కిందకు పడేస్తుంది. ఉన్నత స్థాయికి చేరి ఉత్తమ జీవనం గడుపుతున్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అందుకే అన్నింటికీ సిద్ధమై ఉండాలి. ఏది ఎదురైనా ఆనందంగా స్వీకరించాలి.. సంతోషంగా ఆస్వాదించాలి.. ఈ ఫుడ్ డెలివరీ ఉద్యోగి జీవితం చెబుతున్న పాఠం ఇదే..
ఒక ఫుడ్ డెలివరీ రైడర్ తనకు ఆహారం మాత్రమే కాదు.. జీవిత పాఠాన్ని అందించారంటూ ఆయన స్ఫూర్తిదాయకమైన కథను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు పుణెకు చెందిన శ్రీపాల్ గాంధీ. ఈ జీవితగాథ సోషల్ మీడియాలో నెటిజనులను హత్తుకుంటోంది. ప్రశంసలు వెల్లువను అందుకుంటోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. చాలా మంది ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి ఆహారం తెప్పించుకుంటుంటారు. ఏదైనా మిస్ అయినా, పొరపాటు జరిగినా ఆ తెచ్చిన వ్యక్తి మీద అరుస్తుంటారు. కానీ శ్రీపాల్ గాంధీ డెలివరీ రైడర్‌ను మెల్లగా కదిలించి అతని జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
శ్రీపాల్ గాంధీ సబ్‌వే నుండి లంచ్ ఆర్డర్ పెట్టారు. ఫుడ్ డెలివరీ రైడర్ ఆహారాన్ని తీసుకొచ్చాడు. కానీ పాకెట్ చూడగానే అందులో శాండ్‌విచ్ మాత్రమే ఉందని, మిగిలిన పదార్థాలు మిస్ అయ్యాయని శ్రీపాల్ గుర్తించి డెలివరీ రైడర్‌కు చెప్పారు. కాసేపు కంగారు పడిన డెలివరీ రైడర్ "రెస్టారెంట్ లేదా జొమాటోకు కాల్ చేయండి సార్" అంటూ వినయంగా జవాబిచ్చాడు. దీంతో శ్రీపాల్ సబ్‌వే వారిని సంప్రదించగా క్షమాపణలు చెప్పి 'రైడర్ ను వెనక్కి పంపగలరా?' మిస్ అయిన వాటిని తిరిగిపంపుతాం.. అతనికి రూ.20 చెల్లిస్తాం' అని బదులిచ్చారు.
ఎంత వినయం?
ఫుడ్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ జొమాటో ఆదేశిస్తే తప్ప డెలివరీ భాగస్వాములు రెస్టారెంట్‌కు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తమ రైడర్లకు చెల్లించేది జొమాటో. రెస్టారెంట్ కాదు. అయినా ఈ డెలివరీ ఏజెంట్ ఏమాత్రం వెనుకాడలేదు. "సార్, అది నా బాధ్యత. కస్టమర్ సంతోషమే తాను కోరుకుంటాను" అంటూ మళ్లీ రెస్టారెంట్‌కు వెళ్లి మిస్ అయిన వాటిని తిరిగి తీసుకొచ్చాడు. సబ్‌వే వాళ్ల నుంచి రూ.20 పరిహారాన్ని కూడా ఆయన తీసుకోలేదు. "దేవుడు నాకు ఎ౦తో ఇచ్చాడు. ఒకరు చేసిన పొరపాటుకు నేను ఈ డబ్బు ఎందుకు తీసుకోవాలి? అంటూ అతను శ్రీపాల్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.
జీవిత గమనాన్ని మార్చిన కారు ప్రమాదం
రైడర్ తన గతం గురించి శ్రీపాల్ గాంధీ వద్ద ఓపెన్ అయ్యాడు. షాపూర్జీ పల్లోంజీలో కన్‌స్ట్రక్షన్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ నెలకు రూ.1.25 లక్షల జీతం అందుకునేవారు. కానీ ఒక కారు ప్రమాదం అతని జీవిత గమనాన్ని మార్చేసింది. ఎడమ చేయి, కాలు పక్షవాతానికి గురయ్యాయి. తన ఉద్యోగాన్ని, స్థిరత్వాన్ని, కొంతకాలానికి ఆశను కోల్పోయాడు. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అతనికి తోడ్పాడు అందించింది. ఫుడ్ డెలివరీ పార్ట్‌నర్‌గా అవకాశమిచ్చింది.
తన కుమార్తె ఇప్పుడు దంతవైద్యం చదువుతోందని శ్రీపాల్‌తో ఫుడ్ డెలివరీ రైడర్ అన్నారు. కేవలం ఆదాయం కోసమే కాకుండా తన కలను సజీవంగా ఉంచుకోవడానికి ఆయన రైడ్ చేస్తున్నారని శ్రీపాల్ గాంధీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "అతను జీవితాన్ని నిందించలేదు. ఫిర్యాదులు చేయలేదు. సాకులు చెప్పలేదు" అని రాసుకొచ్చారు. స్వామి సమర్థ్‌ను విశ్వసించే అతను 'దేవుడు నాతో ఉన్నాడు. నేనెందుకు కంగారు పడాలి?" అని నవ్వుతూ అన్నాడని శ్రీపాల్ వివరించారు.
"ఈ రోజు నాకు శాండ్ విచ్ వచ్చింది. కానీ కృతజ్ఞత, స్థిరత్వం, ఆశావాదం నా దగ్గరే నిలిచిపోయాయి" అంటూ తన పోస్ట్ ను ముగించారు. అతనికి ఉపాధి కల్పించిన జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారి నెటిజనుల ప్రశంసలు అందుకుంది. అలాంటి వారికి సెల్యూట్.. వావ్, అద్భుతం.. నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ కామెంట్లు పెట్టారు.