గ్యాస్‌ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!! | LPG Crisis Drives Massive Demand for Induction Stoves Before Ugadi Ramzan | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!!

Mar 16 2026 3:49 PM | Updated on Mar 16 2026 4:16 PM

LPG Crisis Drives Massive Demand for Induction Stoves Before Ugadi Ramzan

ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో ఇండక్షన్ స్టౌలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే.. ఇండక్షన్ స్టౌల కొరత పెరగడంతో.. ఇప్పటికిప్పుడు వాటిని తయారు చేసే పరిస్థితులు లేవని, చైనా నుంచి ముడిపదార్థాలు దిగుమతి అవ్వడానికి 45 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది.  ఇండక్షన్ స్టౌల లభ్యత భారీగా తగ్గిపోవడానికి కారణాలేమిటి? వరుస పండగల వేళ.. పౌరుల పరిస్థితి ఏమిటి?

500 శాతం డిమాండ్ 
హిందువులకు నూతన సంవత్సరమైన ఉగాది.. అదేవిధంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్ మరో మూడునాలుగు రోజుల్లో రానున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడడంతో పండుగ పూట పిండివంటలు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్‌పీజీ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే హాస్టళ్లలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి.

హోటళ్లలో దోశ, పూరీ, మైసూర్ బజ్జీ వంటి పదార్థాలు అందుబాటులో లేకుండా పోయాయి. కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థల్లోని క్యాంటీన్‌లు కూడా మూతపడ్డాయి. గృహావసరాల సిలిండర్ సరఫరాలో ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. బుక్ చేసిన వారం పది రోజులకు గానీ గ్యాస్ బండ అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అటు ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్ ప్లాట్ ఫారాల్లో.. ఇటు ఆఫ్‌లైన్‌లో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ షోరూంలలో కూడా ఇండక్షన్ స్టౌల కొరత నెలకొంది. ఇండక్షన్ స్టౌల కోసం ఒక్కసారిగా 500 శాతం దాకా డిమాండ్ పెరిగిందని డీలర్లు చెబుతున్నారు.

ఇప్పటికిప్పుడు ఇండక్షన్ స్టౌల ఉత్పత్తిని పెంచొచ్చా?
ఇండక్షన్ స్టౌల తయారీలో కీలకమైన ముడి పదార్థాలు చైనా నుంచి వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్పత్తిదారులు ముడిపదార్థాల కోసం ఇప్పటికిప్పుడు ఆర్డరిచ్చినా.. అవి భారత్‌కు చేరడానికి కనీసం 45 రోజుల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క ఇండక్షన్ స్టౌ అని కాకుండా.. ఎయిర్ ఫ్రయ్యర్లు, ఓటీజీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, సోలార్ కుక్కర్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణం భోపాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యపట్టణం లఖ్‌నవూల్లో దాదాపుగా ఇండక్షన్ స్టౌలకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండక్షన్ స్టౌల కోసం డిమాండ్ బాగా పెరిగింది. ధరలు కూడా పైపైకి వెళ్తున్నాయి. నెల క్రితం వరకు 2,200 రూపాయలకు దొరికే ఇండక్షన్ స్టౌ ధర ఇప్పుడు 3 వేల రూపాయలకు చేరుకుంది. ఫిలిప్స్ కంపెనీకి చెందిన ముంబై బ్రాంచ్ మేనేజర్ వివేక్ గౌర్ కూడా దీనిపై స్పందించారు. ఎల్‌పీజీ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు వెల్లడించారు. డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుందన్నారు. భోపాల్‌లోని ఉషా ఇంటర్నేషనల్ డిప్యూటీ సేల్స్ మేనేజర్ వినీత్ శర్మ కూడా సాక్షితో మాట్లాడుతూ నెలకు సగటున వెయ్యి యూనిట్ల మేర ఇండక్షన్ స్టౌల విక్రయాలు జరిగేవని... ఇప్పుడు రోజుకు 10 వేల యూనిట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఇప్పటికిప్పుడు ఉత్పత్తిని పెంచడానికి ముడిపదార్థాల అవసరం ఉంటుందని, అందుకు చైనానే మార్గమని చెబుతున్నారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టౌ తయారీలో ఉపయోగించే హీట్ ప్లేట్లు చైనా నుంచి వస్తాయి. కంట్రోలింగ్ వ్యవస్థ, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం భారత్ ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు ఆ పదార్థాల కోసం 45 రోజుల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది.

ఏయే రంగాలపై ప్రభావం?
గ్యాస్ కొరత దాదాపు అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉత్తరాది కార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారు. వీరికి రెగ్యులర్ ఎల్‌పీజీ కనెక్షన్లు ఉండవు. చిన్న సిలిండర్లతో వంటలు చేసుకుంటారు. సాధారణంగా 650 నుంచి 750 వరకు 5 కేజీల చిన్న సిలిండర్ల రీఫిలంగ్ చార్జీలుంటాయి. గడిచిన 15 రోజులుగా మార్కెట్లో చిన్న సిలిండర్ల రీఫిల్లింగ్ జరగడం లేదు. దీంతో వాళ్లంతా స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హోటల్ రంగంపై సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీని ప్రభావం పర్యాటకరంగంపై పడుతుంది. ఇండక్షన్ స్టౌలు ఇళ్లలో వంటకు సరిపోతాయే తప్ప.. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో వంటకు పెద్దగా ఉపయోగపడవు.

రాబోయే పండుగలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది?
ఉగాదికి భక్ష్యాలు చేయడం ప్రత్యేకత. దీంతోపాటు.. కొత్త మామిడికాయలతో చేసే పులిహోర, పంచభక్ష్య పలహారాలను దేవుడికి నివేదన చేయడం తెలుగువారి సంప్రదాయం. అదేవిధంగా రంజాన్ ఈద్ సందర్భంగా షీర్‌కుర్మా, ఇతర వంటకాలు చేయడం ఆనవాయితీ. దీంతో.. గ్యాస్ కొరత, ఇండక్షన్ స్టౌల లభ్యత లేకపోవడం ఈ పండుగలపై తీవ్రంగా కనిపించనుంది. ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు.. అంటే మార్చి 27న శ్రీరామ నవమి, ఏప్రిల్ 3న గుడ్‌ఫ్రైడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి.

ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?
డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పండుగల నేపథ్యంలో సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రానికి లేఖ రాశారు. జిల్లాల స్థాయిలో గ్యాస్ సరఫరాను స్వయంగా కలెక్టర్లు మానిటర్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement