
అర్జెంటీనా సూపర్ స్టార్ భారత పర్యటన ఖరారు
15న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం
డిసెంబర్ 12న కోల్‌కతాకు ఫుట్‌బాల్ స్టార్
సెలబ్రిటీలతో బిజీ బిజీగా 4 రోజుల షెడ్యూల్
కోల్‌కతా: అర్జెంటీనా సూపర్‌స్టార్ ఫుట్‌బాలర్ లయోనల్ మెస్సీ భారత పర్యటన ఖరారైంది. చాలా రోజులుగా భారత టూర్ ఉంటుందని వార్తలు వస్తుండగా... తాజాగా షెడ్యూల్‌ను ప్రకటించారు. మెస్సీ పర్యటనను ‘గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) టూర్ ఆఫ్ ఇండియా’గా నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఈవెంట్ ప్రమోటర్ శతద్రు దత్తా శుక్రవారం వెల్లడించారు. ఈ మధ్య సెలబ్రిటీలు టెన్నిస్ తరహా రాకెట్‌తో ఆడే ఆటే ‘ప్యాడెల్’. అయితే ఇది పూర్తిగా టెన్నిస్ ఆడే రాకెట్ కాదు. కాస్త భిన్నంగా ఉంటుంది.
డిసెంబర్ 12 నుంచి 15 వరకు భారత్‌లోని ప్రముఖ నగరాలైన కోల్‌కతా, ముంబై, ఢిల్లీ అహ్మదాబాద్‌లలో మెస్సీ భారత అభిమానులను అలరిస్తారు. ప్రతీ నగరంలోనూ చిన్నారులు, యువ ఫుట్‌బాలర్లతో కలుస్తారు. మన ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. నాలుగు రోజుల బిజీ పర్యటనలో ముందుగా అతను కోల్‌కతాలో అడుగు పెడతాడు. ఫుట్‌బాల్ అంటేనే శివాలుగే కోల్‌కతాలో డిసెంబర్ 12న మెస్సీ గడుపుతారు.
ఈడెన్ గార్డెన్స్ లేదంటే సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు గోట్ ఆట ఆడతారు. దీంతో పాటు భారత మాజీ కెపె్టన్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం, ఫుట్‌బాల్ కెపె్టన్ బైచుంగ్ భూటియాలతో కలిసి సెవెన్–ఎ–సైడ్ సాఫ్ట్‌టచ్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతారు. సాధారణ ప్రేక్షకులను కూడా ఈ సెలబ్రిటీ మ్యాచ్ చూసేందుకు అనుమతిస్తారు. రూ. 3500 నుంచి మొదలయ్యే టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని నిర్వాహకుడు శతద్రు దత్తా తెలిపారు.
మెస్సీ పర్యటనపై బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీకి వెల్లడించినట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఈ సందర్భంగా ఆమె పోలీసు శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పక్కా ప్లాన్ చేస్తామని హామీ ఇచ్చినట్లు దత్తా చెప్పారు.
14న ముంబైలో హేమాహేమీలతో...
మరుసటి రోజు డిసెంబర్ 13న మెస్సీ అహ్మదాబాద్‌కు పయనమవుతాడు. అక్కడ అదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ప్రైవేట్ కార్యక్రమంలో అతను పాల్గొంటాడు. అటునుంచి 14న నేరుగా ముంబై చేరుకుంటాడు. సీసీఐ బ్రాబౌర్న్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో హేమాహేమీలతో భేటీ అవుతాడు. వాంఖెడే స్టేడియంలో ముంబై ప్యాడెల్ కప్‌లో పాల్గొంటాడు. అధికారికంగా వెల్లడించనప్పటికీ బాలీవుడ్, స్పోర్ట్స్ దిగ్గజాలు షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, ఆమిర్ ఖాన్, టైగర్ ష్రాఫ్, లియాండర్ పేస్, సచిన్ టెండూల్కర్, ధోని, రోహిత్ శర్మలతో టెన్నిస్ తరహా రాకెట్‌తో ఆడే ప్యాడెల్ ఈవెంట్‌లో మెస్సీ కాసేపు ఆడనున్నాడు.
మరుసటి రోజు డిసెంబర్ 15న ఢిల్లీకి పయనమవుతాడు. అక్కడ మొదట భారత ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాద పూర్వకంగా కలిశాక... ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగే ఢిల్లీ అంచె గోట్ కప్‌లో కింగ్ కోహ్లి, శుబ్‌మన్ గిల్‌లతో కలిసి ఆడతాడు. సరిగ్గా ధర్మశాలలో డిసెంబర్ 14న దక్షిణాఫ్రికాతో జరిగే టి20 అనంతరం ఢిల్లీలో ఈ ఈవెంట్ జరుగుతుందని ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) వర్గాలు తెలిపాయి.