Sakshi News home page

పసిడి పోరుకు భారత జట్లు 

Published Thu, Aug 17 2023 12:39 AM

Archery World Cup Stage4 Tournament - Sakshi

పారిస్‌: ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో కనబరిచిన జోరును భారత ఆర్చర్లు ప్రపంచకప్‌ స్టేజ్‌–4 టోర్నీలోనూ కొనసాగించారు. బుధవారం జరిగిన కాంపౌండ్‌ విభాగం టీమ్‌ ఈవెంట్స్‌లో భారత మహిళల, పురుషుల జట్లు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాయి. ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ ప్లేయర్‌ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ చాంపియన్‌ అదితి స్వామి,

పర్ణీత్‌ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 234–233తో ఎల్లా గిబ్సన్, లేలా అనిసన్, ఇసాబెల్‌ కార్పెంటర్‌లతో కూడిన బ్రిటన్‌ జట్టును ఓడించింది. శనివారం జరిగే ఫైనల్లో మెక్సికో జట్టుతో భారత్‌ బృందం తలపడుతుంది.

రెండో సెమీఫైనల్లో మెక్సికో 234–233తో దక్షిణ కొరియాపై గెలిచింది. క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచి టాప్‌ సీడ్‌ హోదాలో నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ ఆడిన భారత జట్టు 233–230 ఎస్తోనియా జట్టును ఓడించింది.  

మరోవైపు ప్రపంచ చాంపియన్‌ ఓజస్‌ దేవ్‌తలే, అభిషేక్‌ వర్మ, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు కూడా బంగారు పతకంపై గురి పెట్టింది. తొలి రౌండ్‌లో భారత జట్టు 239–235తో ఇటలీపై గెలిచింది. క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా 237–235తో మెక్సికో జట్టును ఓడించింది.

భారత్, టాప్‌ సీడ్‌ దక్షిణ కొరియా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో నాలుగు సిరీస్‌ల తర్వాత రెండు జట్లు 235–235తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్‌ ఆఫ్‌’ అనివార్యమైంది. ‘షూట్‌ ఆఫ్‌’లోనూ రెండు జట్లు 30–30తో సమంగా నిలిచాయి.

అయితే కొరియా ఆర్చర్లతో పోలిస్తే భారత ఆర్చర్‌ ఓజస్‌ దేవ్‌తలే కొట్టిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంలో ఉండటంతో భారత జట్టును విజేతగా ప్రకటించారు. రెండో సెమీఫైనల్లో అమెరికా 238–234తో డెన్మార్క్‌పై గెలిచి శనివారం జరిగే స్వర్ణ పతక మ్యాచ్‌లో భారత్‌తో పోటీపడేందుకు సిద్ధమైంది.   

రెండో రౌండ్‌లో ధీరజ్‌ 
బుధవారం జరిగిన పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌తోపాటు అతాను దాస్‌ రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్‌లో ధీరజ్‌ 6–2తో ఇమాదిద్దీన్‌ బాక్రి (అల్జీరియా)పై, అతాను దాస్‌ 6–0తో ఎలైన్‌ వాన్‌ స్టీన్‌ (బెల్జియం)పై గెలుపొందారు.

భారత్‌కే చెందిన మృణాల్‌ చౌహాన్‌ 3–7తో ఫ్లోరియన్‌ ఫాబెర్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో, తుషార్‌ ప్రభాకర్‌ 2–6తో పీటర్‌ బుకువాలస్‌ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయారు. రికర్వ్‌ క్వాలిఫయింగ్‌ టీమ్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లో భారత జట్టు 2034 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దాంతో భారత జట్టుకు నేరుగా రెండో రౌండ్‌లోకి ‘బై’ లభించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement