
ప్రపంచకప్ టోర్నీలో రెండో స్వర్ణం సొంతం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత షూటర్ అనుష్క ఠాకూర్ గురి అదిరింది. జూనియర్ మహిళల 50 మీటర్ల ప్రోన్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం నెగ్గిన అనుష్క... తాజాగా 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లోనూ మెరిసి పసిడి పతకాన్ని దక్కించుకుంది.
ఆదివారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఫైనల్లో అనుష్క 461 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన మహిత్ సంధూ 422.7 పాయింట్లతో ఐదో స్థానంలో, ప్రాచి గైక్వాడ్ 399.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో భారత షూటర్ అడ్రియన్ కర్మాకర్ రజత పతకాన్ని సంపాదించాడు.
అడ్రియన్ 454.8 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. మరో నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. భారత్ ఖాతాలో 4 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలు ఉన్నాయి.