
రాంచీ: భారత అమ్మాయిల హాకీ జట్టు ఎదురులేని ప్రదర్శనతో దూసుకెళుతోంది. ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో భారత్ 5–0తో మలేసియాపై ఘనవిజయం సాధించింది. వందన కటారియా (7, 21వ నిమిషాల్లో) చక్కని ఆటతీరుతో రెండు గోల్స్ చేసింది. సంగీత కుమారి (28వ ని.), లాల్‌రెమ్‌సియామి (28వ ని.) క్షణాల వ్యవధిలోనే చెరో గోల్ సాధించిపెట్టారు. మూడో క్వార్టర్‌లో జ్యోతి (38వ ని.) కూడా గోల్ చేయడంతో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. తొలి లీగ్‌లో భారత్ 7–1తో థాయ్‌లాండ్‌పై నెగ్గింది.