
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరుపై టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఓడిపోయామన్న బాధ లేకుండా.. కేవలం ‘నో- షేక్‌హ్యాండ్’ మీద రాద్ధాంతం చేయడంపైనే దృష్టి పెట్టారని మండిపడ్డాడు. కరచాలనం విషయంలో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తప్పేమీ లేదని.. తానే గనుక అతడి స్థానంలో ఉంటే పాక్ జట్టుతోనే సారీ చెప్పించుకునేవాడినని అశూ అన్నాడు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ (IND vs PAK) జట్లు ఆసియా కప్ టీ20-2025లో భాగంగా తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా గత ఆదివారం (సెప్టెంబరు 14) జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు.. పాక్ ప్లేయర్లతో కరచాలనానికి నిరాకరించారు.
ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని డ్రామా
ఈ విషయాన్ని అవమానంగా భావించిన పాక్ క్రికెట్.. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహారశైలిపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఇక ముందు పాక్ ఆడే మ్యాచ్‌లకు రిఫరీగా ఆయనను తొలగించాలని కోరింది. లేదంటే ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని డ్రామా చేసింది. అయితే, ఐసీసీ దిగిరాకపోగా.. యూఏఈతో పాక్ మ్యాచ్‌లోనూ ఆండీనే కొనసాగించింది. అంతేకాదు.. తదుపరి సూపర్-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబరు 21) నాటి భారత్- పాక్ పోరులోనే అతడినే రిఫరీగా ఎంపిక చేసింది.
స్కూల్ టీచరా? లేదా ప్రిన్సిపలా?
ఈ నేపథ్యంలో పాక్ వ్యవహారశైలిపై అశ్విన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ‘‘నిజానికి మీ పరువు పోకుండా ఆండీ పైక్రాఫ్ట్ మిమ్మల్ని కాపాడారు. తాము హ్యాండ్‌షేక్ చేయమన్న విషయాన్ని టీమిండియా ముందుగానే రిఫరీకి చెప్పింది. అదే విషయాన్ని ఆయన మీకు చెప్పారు. అంతే. కానీ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మీరు చేసిన డ్రామా ఏంటి? అసలు దేని గురించి మీ రాద్ధాంతం?..
అయినా ఆండీ పైక్రాఫ్ట్ ఏమైనా స్కూల్ టీచరా? లేదా ప్రిన్సిపలా?.. సూర్య దగ్గరికి వెళ్లి.. ‘రండి.. వచ్చి కరచాలనం చేయండి’ అని చెప్పాలా? ఆయన పని అది కాదు కదా!.. కాబట్టి ఇందులో మీకు ఆయన తప్పు ఎక్కడ కనిపించింది?
మీతోనే సారీ చెప్పించుకునేవాడిని
నేనే గనుక ఆండీ స్థానంలో ఉండి ఉంటే.. ఇలా చేసినందుకు మీతోనే సారీ చెప్పించుకునేవాడిని. ఆయన మీకెందుకు క్షమాపణ చెప్పాలి?’’ అంటూ పాక్ క్రికెట్ బోర్డు తీరును అశ్విన్ ఏకిపారేశాడు. కాగా యూఏఈతో మ్యాచ్‌కు ముందు బాయ్‌కాట్ నాటకం ఆడిన పాక్.. ఐసీసీ దిగిరాకపోవడంతో రిఫరీ ఆండీ తమకు క్షమాపణలు చెప్పాడంటూ ఆడియోలేని ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.