అండర్సన్‌–సచిన్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా | Anderson-Tendulkar Trophy grand launch postponed | Sakshi
Sakshi News home page

అండర్సన్‌–సచిన్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా

Jun 17 2025 5:05 AM | Updated on Jun 17 2025 5:05 AM

Anderson-Tendulkar Trophy grand launch postponed

లండన్‌: భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సంబంధించి అండర్సన్‌–టెండూల్కర్‌ ట్రోఫీ (ఏటీటీ)ని ఈ నెల 14నే ఆవిష్కరించాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో భారతీయులతో పాటు 50కి పైగా బ్రిటీష్‌ జాతీయులు కూడా మరణించారు. దాంతో ట్రోఫీ కార్యక్రమం నిర్వహించడం సరైంది కాదని వారు భావించారు. ఇదే విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. అయితే ఒకటి, రెండు రోజుల్లోనే ట్రోఫీని ఆవిష్కరిస్తారని ఆయన చెప్పారు.

 మరోవైపు ఇప్పటి వరకు భారత మాజీ కెపె్టన్‌ మన్సూర్‌ అలీఖాన్‌ పేరుతో ‘పటౌడీ ట్రోఫీ’గా ఉన్న పేరును ‘అండర్సన్‌–సచిన్‌ ట్రోఫీ’గా మార్చడంపై చాలా మందిలో అసంతృప్తి ఉంది. పటౌడీ గౌరవార్ధం దీనిని అదే పేరుతో కొనసాగించాలని స్వయంగా సచిన్‌ టెండూల్కర్‌ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)ను కోరినట్లు సమాచారం. అయితే ట్రోఫీ పేరు విషయంలో కొత్త నిర్ణయానికే ఈసీబీ కట్టుబడి ఉంటే... ఈ సిరీస్‌లో పటౌడీ పేరుతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ లాంటి అవార్డును అందించైనా సరే మరో రూపంలో ఆయనను స్మరించుకునే విషయాన్ని పరిశీలించాలని బీసీసీఐ కోరింది.    

Advertisement
 
Advertisement
Advertisement