
సెయింట్ జార్జెస్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా టాపార్డర్ విఫలమైంది. . ఓపెనర్లు సామ్ కొన్‌స్టాస్ (37 బంతుల్లో 25; 4 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (29 బంతుల్లో 16; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... స్టీవ్ స్మిత్ (3), కామెరూన్ గ్రీన్ (37 బంతుల్లో 26; 4 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (43 బంతుల్లో 29; 3 ఫోర్లు) పెవిలియన్‌కు వరుస కట్టారు. అయితే బ్యూ వెబ్‌స్టెర్(60), అలెక్స్ కారీ(63) మరోసారి హాఫ్ సెంచరీలతో ఆసీస్‌ను ఆదుకున్నారు.
దీంతో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేయగల్గింది. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4 వికెట్లు పడగొట్టగా... సీల్స్ రెండు, షామార్ జోసెఫ్, ఫిలిప్ తలా ఒక వికెట్ తీశారు. అయితే వెలుతురు లేమి కారణంగా తొలి రోజు కేవలం 66.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రెండో రోజు ఆటలో విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించనుంది.
బ్రాత్‌వైట్ 100వ టెస్టు
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ ఈ మ్యాచ్ ద్వారా వంద టెస్టులు ఆడిన పదో కరీబియన్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఫ్రాంచైజీ క్రికెట్ ప్రభావంతో జాతీయ జట్టు కన్నా లీగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విండీస్ ప్లేయర్ల మధ్య బ్రాత్‌వైట్ ఈ ఘనత అందుకోవడం విశేషం.
జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ ఆడినా చాలు అనే లక్ష్యంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న బ్రాత్‌వైట్... సుదీర్ఘ ఫార్మాట్‌పై మక్కువతో టి20ల జోలికి వెళ్లకుండా ఈ స్థాయికి చేరుకున్నాడు.
చదవండి: #Shubman Gill: టెస్టు క్రికెట్‌కు సరికొత్త రారాజు.. ఇంక అంతా 'శుభ్' మయం