
"ఈ సిరీస్‌లో నేను బెస్ట్ బ్యాటర్‌గా నిలుస్తా.. కెప్టెన్‌గా ఎటువంటి ఒత్తిడి తీసుకోను".. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు భారత యువ సారథి శుబ్‌మన్ గిల్ చెప్పిన మాటలివి. ఇప్పుడు అందుకు తగ్గట్టే దూసుకుపోతున్నాడు ఈ యువ రాజు.
ఎవరైతే అతడిని కెప్టెన్‌గా ఎంపికచేయడాన్ని వ్యతిరేకించారో.. ఇప్పుడు వారితోనే శెభాష్ అనిపించుకుంటున్నాడు. కెప్టెన్‌గా తొలి టెస్టులోనే సెంచరీతో మెరిసిన గిల్.. ప్రస్తుతం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఏకంగా ద్విశతకంతో మెరిశాడు.
తన అసాధారణ ప్రదర్శనతో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్‌గా చరిత్రను తిరగ రాశాడు. ఈ సిరీస్ ముందు వరకు ఇంగ్లండ్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా చేయని శుబ్‌మన్.. ఇప్పుడు శతకాల మోత మ్రోగిస్తున్నాడు. ఇంతకుముందు ఒక్క లెక్క.. కెప్టెన్ అయ్యాక ఒక లెక్క అన్నట్లు గిల్ ప్రయాణం సాగుతోంది.

జయహో నాయక..
ఒక జట్టు నాయకుడికి ఉండవలసిన అన్ని లక్షణాలు గిల్‌కు ఉన్నాయి. జట్టు గెలిస్తే క్రెడిట్ తీసుకున్న వాడు నిజమైన కెప్టెన్ కాడు.. అదే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకొచ్చి ఆదుకున్న వాడే నిజమైన లీడర్. ఇది గిల్‌కు సరిగ్గా సరిపోతుంది.
తొలి టెస్టులో ఓటమికి నైతిక బాధ్యత వహించిన గిల్.. ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్‌లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును.. తన బాధ్యయుత ఆటతీరుతో ఆదుకున్నాడు.
ఆచితూచి ఆడి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలుత 100 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసిన ఈ పంజాబీ ఆటగాడు.. క్రీజులో నిలదొక్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. గిల్ తొలి టెస్టు డబుల్ సెంచరీ వెనక ఎంతో శ్రమ దాగి ఉంది. దాదాపు రెండు రోజుల పాటు ఎంతో ఓర్పు, నిబద్దతతో బ్యాటింగ్ చేసి జట్టును పటిష్ట స్ధితిలో నిలిపాడు. అతడి ఆటతీరుకు ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు.

అప్పటిలో సచిన్, కోహ్లి..
భారత టెస్టు జట్టులో నాలుగో నంబర్‌కు ప్రత్యేక స్ధానం ఉంది. ఒక దశాబ్ధం క్రితం జోహన్నెస్‌బర్గ్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వదిలిపెట్టి వెళ్లిన నాలుగో నంబర్ స్ధానాన్ని లెజెండరీ విరాట్ కోహ్లి భర్తీ చేశాడు. ఆ స్ధానంలో దాదాపు పుష్కరకాలం పాటు విరాట్ కోహ్లి విజయవంతంగా కొనసాగాడు.
విరాట్ తన అద్బుత ప్రదర్శనలతో మాస్టర్‌బ్లాస్టర్‌ను మరిపించాడు. ఇప్పుడు కింగ్ కోహ్లి వారసుడిగా అదే ఎంఆర్‌ఎఫ్( MRF) బ్యాట్‌తో 25 ఏళ్ల గిల్ బాధ్యతలు చేపట్టాడు. ఈ సిరీస్ ఆరంభానికి ముందు వరకు ఈ కీలకమైన స్దానంలో ఎవరి బ్యాటింగ్ వస్తారన్న చర్చ తీవ్ర స్ధాయిలో జరిగింది.
కొంతమంది మాజీలు కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్‌ను నాలుగో స్ధానంలో బ్యాటింగ్ పంపాలని సూచించారు. కానీ కెప్టెన్ గిల్ మాత్రం విరాట్ కోహ్లి స్దానానికి తానే సరైనోడనని ముందుకు వచ్చాడు. అందుకు తగ్గట్టే ఆ స్ధానంలో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లో శతక్కొట్టాడు. ఇప్పుడు రెండో టెస్టులో 269 పరుగులు చేసి సత్తాచాటాడు. ఓవరాల్‌గా గిల్ ఇప్పటివరకు 34 టెస్టులు ఆడి 40.65 సగటుతో 2317 పరుగులు చేశాడు.

పట్టు బిగిస్తున్న భారత్..
ఇక ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్(30), జో రూట్(18) ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ రెండు, సిరాజ్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు.