తప్పతాగి ఆసుపత్రిపాలైన ఘటనపై స్పందించిన మ్యాక్స్‌వెల్‌

Affected My Family A Little More Than Me, Maxwell Reflects On Alcohol Related Incident - Sakshi

తప్ప తాగి ఆసుపత్రిపాలైన ఘటనపై ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ స్పందించాడు. తన కెరీర్‌లో అదో చీకటి అధ్యాయమని అన్నాడు. అలా జరిగినందుకు సిగ్గుపడుతున్నానని తెలిపాడు. ఆ దురదృష్టకర ఘటన తనకంటే ఎక్కువగా తన ఇంట్లోని వాళ్లను ప్రభావితం చేసిందని పశ్చాత్తాపపడ్డాడు.

గడ్డు పరిస్థితుల్లో తన చుట్టూ ఉన్నవారంతా మద్దతుగా నిలిచారని పేర్కొన్నాడు. తన పరిస్థితి అర్ధం​ చేసుకుని అండగా నిలిచిన ఆసీస్‌ క్రికెట్‌ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు. చుట్టూ ఉన్న వారందరి సహకారం వల్లే  త్వరగా కోలుకుని, తిరిగి మైదానంలో అడుగుపెట్టానని తెలిపాడు. విండీస్‌పై సుడిగాలి శతకం (55 బంతుల్లో 120 నాటౌట్‌; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) బాదిన అనంతరం మ్యాక్స్‌వెల్‌ పై విధంగా స్పందించాడు.

కాగా, మ్యాక్స్‌వెల్‌ గత నెలలో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రెట్‌ లీ హోస్ట్‌ చేసిన సంగీత కచేరీకి హాజరై తప్ప తాగి కుప్పకూలిపోయాడు. ఈ ఘటన అనంతరం మ్యాక్సీని ఆసుపత్రికి తరలించారు. మ్యాక్సీకి తప్పతాగి వార్తల్లోకి ఎక్కడం ఇది కొత్తేమీ కాదు. 2022లో స్నేహితుడి బర్త్‌డే పార్టీలో తప్పతాగి కాలు విరుగగొట్టుకున్నాడు. మ్యాక్సీకి సంబంధించి బయటపడని ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయని అంటుంటారు. 

ఇదిలా ఉంటే, తాజా ఘటన అనంతరం వేగంగా కోలుకున్న మ్యాక్స్‌వెల్‌.. విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20 మ్యాక్స్‌వెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సుడిగాలి శతకం బాది తన జట్టును ఒంటిచేత్తో గెలిపించడమే కాకుండా  రోహిత్‌ శర్మ పేరిట ఉన్న అత్యధిక టీ20 శతకాల రికార్డును (5) సమం చేశాడు.  

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top