ఇది నిజంగా సిగ్గు చేటు.. దేశం ప‌రువు పోతుంది: డివిలియర్స్‌ | AB de Villiers slams talks around South Africas racial quota ahead of T20 WC | Sakshi
Sakshi News home page

ఇది నిజంగా సిగ్గు చేటు.. దేశం ప‌రువు పోతుంది: డివిలియర్స్‌

May 30 2024 6:04 PM | Updated on May 30 2024 6:24 PM

AB de Villiers slams talks around South Africas racial quota ahead of T20 WC

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ఈవెంట్‌కు ఎంపిక చేసిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుపై వివాదం చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే.  ఈ మెగా టోర్నీకి క్రికెట్ సౌతాఫ్రికా సెల‌క్ష‌న్ క‌మిటీ 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. అయితే ఇందులో బ్లాక్  ఆఫ్రికన్ ఆటగాడు కగిసో రబాడ‌కు మాత్ర‌మే సెల‌క్ట‌ర్లు చోటు ఇచ్చారు.

క్రికెట్ దక్షిణాఫ్రికా పాల‌సీ ప్ర‌కారం... ద‌క్షిణాఫ్రికా ఆడే ప్ర‌తీ మ్యాచ్‌లోనూ ప్లెయింగ్ ఎలెవ‌న్‌లో క‌నీసం ఇద్ద‌రూ న‌ల్ల‌జాతి ఆఫ్రికన్‌లు ఉండాలి. అదే విధంగా కలర్‌ ఆఫ్రికన్స్ క‌నీసం ఆరుగురుఉండాలి. అయితే సెల‌క్ట‌ర్లు దక్షిణాఫ్రికా క్రికెట్ పాలసీకి విరుద్దంగా కేవ‌లం ఒక్క బ్లాక్  ఆఫ్రికన్(ర‌బాడ‌)ను మాత్ర‌మే సెల‌క్ట్ చేశారు. 

మ‌రో న‌ల్ల‌జాతి ఆట‌గాడు లుంగీ ఎంగిడీకి ప్రోటీస్ సెల‌క్ట‌ర్లు రిజ‌ర్వ్ జాబితాలో చోటిచ్చారు. కేవ‌లం ఒకే బ్లాక్ ఆఫ్రిక‌న్‌కు జ‌ట్టులో చోటు ఇవ్వ‌డం ప్ర‌స్తుతం వివాదాస్ప‌ద‌మైంది. సెల‌క్ట‌ర్ల నిర్ణ‌యాన్ని దక్షిణాఫ్రికా మాజీ క్రీడా మంత్రి ఫికిలే మాబులా సైతం త‌ప్పుబ‌ట్టాడు.

"టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు ప్రోటీస్ టీమ్‌లో కేవ‌లం ఒక్క బ్లాక్ ఆఫ్రిక‌న్ ఆట‌గాడికి మాత్ర‌మే చోటు ద‌క్కింది. ఇది సరైన నిర్ణ‌యం కాదు. ఇటువంటి నిర్ణ‌యాలు జాతీయ క్రికెట్ జట్టులో చోటు ఆశిస్తున్న ఆట‌గాళ్లంద‌రికి స‌రైన న్యాయం ద‌క్కేలా చేయ‌వు" అంటూ మాబులా  ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

తాజాగా ఇదే విషయంపై ప్రోటీస్ దిగ్గ‌జం ఏబీ డివిలియ‌ర్స్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ప్రపంచకప్ వంటి ప్రధాన టోర్నీకి ముందు ఇటువంటి వివాదాలు ఆట‌గాళ్ల ఏకాగ్ర‌త‌ను దెబ్బ తీస్తాయ‌ని డివిలియర్స్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

"టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్న‌మెంట్ ఆరంభానికి ముందు ఇటువంటి చ‌ర్చ‌లు  నిజంగా సిగ్గు చేటు. ఇదేమి మ‌న‌కు కొత్త కాదు. ఇది దేశానికే అవ‌మానం. 

కానీ ఇటువంటి వివాదాలు ఆట‌గాళ్ల‌ను మాన‌సికంగా దెబ్బ తీస్తాయి. అదృష్టవశాత్తూ ఈ సారి అక్క‌డ జ‌రిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ప్ర‌స్తుతం కేవ‌లం ప్రేక్షకుడిగానే ఉన్నా. 

గ‌తంలో కూడా ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు ఇటువంటి వివాదాలు త‌లెత్తాయి. ఇక వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు ఎంపిక చేసిన జ‌ట్టు అద్భుతంగా ఉంది. లుంగి ఎంగిడీ విష‌యంలో సెల‌క్ట‌ర్లు ఆలోచించే నిర్ణ‌యం తీసుకున్నార‌ని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అత‌డు  త‌న ఫామ్‌ను కోల్పోయాడు.

అదే విధంగా గాయాల‌తో కూడా పోరాడుతున్నారు. అందుకే అత‌డికి ప్ర‌ధాన జ‌ట్టులో చోటు ఇవ్వ‌లేదు. ఒక‌వేళ ఎంగిడీ ప్ర‌ధాన జ‌ట్టులో ఉండి ఉంటే ఎటువంటి వివాదాలు తలెత్తేవి కావు. కొన్నిసార్లు జ‌ట్టు ఎంపికలో ఇలాంటివి జరుగుతాయి. టీమ్ కాంబ‌నేష‌న్‌కు త‌గ్గ‌ట్టు నిర్ణ‌యాలు తీసుకుంటారు.  చిన్న చిన్న విషయాలను పెద్ద‌విగా చూడ‌కూడ‌ద‌ని" జియో సినిమాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఏబీడీ పేర్కొన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement