
ఐపీఎల్-2025లో అదరగొట్టిన యువ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. భారత అండర్-19 జట్టు తరఫునా అదరగొట్టాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో తన అరంగేట్ర సీజన్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. ఇంగ్లండ్ గడ్డ మీదా వేగవంతమైన శతకంతో మెరిశాడు.
తద్వారా యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసులో, తక్కువ బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న తొలి క్రికెటర్‌గా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లంగ్ పర్యటనలో అతడి ప్రదర్శన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్న మాజీ క్రికెటర్లు.. ఇలాగే కొనసాగితే త్వరలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమంటున్నారు.
252కు పైగా స్ట్రైక్‌రేటుతో
ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత యువ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ ఆరంభం కాగా.. హోవ్‌లో మొదటి మ్యాచ్ జరిగింది. ఇందులో వైభవ్ సూర్యవంశీ ధనాధన్ దంచికొట్టాడు. కేవలం 19 బంతుల్లోనే 3 ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 252కు పైగా స్ట్రైక్‌రేటుతో 48 పరుగులు సాధించాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడంలో వైభవ్‌ది కీలక పాత్ర. ఇక రెండో యూత్ వన్డేలోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ రాణించాడు. 34 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 45 పరుగులు రాబట్టాడు.
సునామీ శతకంతో చెలరేగి..
అయితే, మూడో వన్డేలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టిన వైభవ్.. ఈసారి ఏకంగా 31 బంతుల్లోనే 86 పరుగులతో దుమ్ములేపాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లతో పాటు తొమ్మిది సిక్స్‌లు ఉండటం విశేషం.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. నాలుగో వన్డేలో మాత్రం వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను ప్రశంసించేందుకు మాటలు చాలవు. మంచి బంతిని గౌరవిస్తూనే.. లూజ్ బాల్ పడ్డప్పుడల్లా బౌండరీలతో ఇరగదీశాడు ఈ చిచ్చరపిడుగు. 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్.. ఇందులో 46 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రాబట్టడం విశేషం.
Highlights of Vaibhav Suryavanshi's superb 143 off 78 against England Under-19s 🙌
(via @WorcsCCC) pic.twitter.com/alFqUTxNHL— ESPNcricinfo (@ESPNcricinfo) July 5, 2025
ఫాస్టెస్ట్ సెంచరీ
ఆ తర్వాత కూడా ఇదే జోరును కొనసాగించిన వైభవ్.. కేవలం 52 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా యూత్ వన్డేలో 14 ఏళ్ల 100 రోజుల వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు వైభవ్. ఇక ఈ మ్యాచ్ వైభవ్ (143)తో పాటు మరో ఆటగాడు విహాన్ మల్హోత్రా (129) కూడా శతకం బాదడంతో భారత్.. ఇంగ్లండ్‌పై ఏకపక్ష విజయం సాధించి 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
ఇక ఆఖరిదైన ఐదో యూత్ వన్డేలో మాత్రం వైభవ్ నామమాత్రంగానే ఆడాడు. 42 బంతులు ఎదుర్కొని కేవలం 33 పరుగులే చేశాడు. మిగతా వారిలో ఆర్‌ఎస్ అంబరీష్ అజేయ అర్ధ శతకం (66)తో రాణించాడు. ఈ క్రమంలో 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసిన భారత జట్టు.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. భారత బౌలర్లు తేలిపోవడంతో 31.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ పనిపూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఏదేమైనా ఈ పర్యటన ద్వారా వైభవ్ సూర్యవంశీ తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారి.. భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంలో ప్రధాన భూమిక పోషించాడు. ఈ ఐదు వన్డేల సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ మొత్తంగా 355 పరుగులు సాధించగా... ఇందులో 29 సిక్సర్లు ఉండటం విశేషం.
ఇక డబుల్ సెంచరీ బాకీ..
ఇక తన ఫాస్టెస్ట్ సెంచరీ తర్వాత బీసీసీఐతో మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ.. ‘‘ఈ రికార్డు గురించి నాకసలు తెలియదు. మా టీమ్ మేనేజర్ అంకిత్ సర్ దీని గురించి చెప్పారు. శుబ్‌మన్ గిల్ (డబుల్ సెంచరీ)ను చూసి నేను ఎంతో స్ఫూర్తి పొందాను.
సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన తీరును గమనించాను. అప్పుడే నేను కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఎలా ఆడాలో అర్థం చేసుకున్నాను. అయితే, సెంచరీ తర్వాత నేను తప్పుడు షాట్ సెలక్షన్‌తో అవుటయ్యాను. లేదంటే గిల్ మాదిరే డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నించేవాడిని.
నేనేం చేసినా జట్టు ప్రయోజనాల కోసమే!..తదుపరి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించేందుకు ప్రయత్నిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, 33 పరుగులకే అవుట్ కావడంతో వైభవ్ ఆశ నెరవేరలేదు. అయినప్పటికీ ఈ సిరీస్‌లో వైభవ్ కనబరిచిన ఆట తీరు అద్భుతమనే చెప్పవచ్చు. వన్డే ఫార్మాట్లో అతడు టీ20 మాదిరి విధ్వంసం సృష్టించడం విశేషం. ఇక తదుపరి ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో యూత్ టెస్టులలోనైనా వైభవ్ తన డబుల్ సెంచరీ కోరికను నెరవేర్చుకుంటాడేమో చూడాలి!
చదవండి: MCC: ఆకాశ్ దీప్ డెలివరీ.. రూట్‌కు అన్యాయం?.. ఎంసీసీ స్పందన ఇదే