
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్ పునఃప్రవేశించనుంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌తో క్రికెట్ విశ్వక్రీడల్లోకి పునరాగమనం చేయనుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను జులై 14న ప్రకటించారు. ఈ షెడ్యూల్‌ను మూడేళ్లు ముందే ప్రకటించడం విశేషం.
ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు 2028 జులై 12 (ఒలింపిక్స్ ప్రారంభానికి రెండు రోజుల ముందు) నుంచి 29 వరకు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు లాస్ ఏంజెలెస్‌కు 50 కిమీ దూరంలో ఉన్న పమోనాలోని ఫెయిర్‌ప్లెక్స్‌లో ప్రత్యేకంగా నిర్మించబడే 500 ఎకరాల తాత్కాలిక స్టేడియంలో జరుగుతాయి.
రాబోయే ఒలింపిక్స్‌లో క్రికెట్ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఆరు అంతర్జాతీయ జట్లు విశ్వవేదికపై పోటీ పడతాయి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కోసం పోటీ జరుగుతుంది. మెడల్స్ మ్యాచ్‌లు (సెమీఫైనల్స్ మరియు బ్రాంజ్, గోల్డ్ మెడల్స్ మ్యాచ్‌లు) జులై 20 (మహిళలు), 29 (పురుషులు) తేదీల్లో జరుగుతాయి.
జులై 14, 21 తేదీల్లో ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు లేవు.
మ్యాచ్ జరిగిన ప్రతి రోజు రెండు మ్యాచ్‌లు ఉంటాయి. ఈ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు, ఉదయం 7 గంటలకు మొదలవుతాయి.
ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చివరి మరియు ఏకైక ప్రాతినిథ్యం 1900 పారిస్ ఒలింపిక్స్‌లో దక్కింది. నాడు గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే పోటీలో పాల్గొన్నాయి. అప్పుడు ఇరు జట్ల మధ్య ఓ అనధికారిక టెస్ట్ మ్యాచ్ జరగగా.. అందులో గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్‌ను కేవలం రెండు రోజుల్లోనే ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
కాగా, 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్ (సిక్సస్), స్క్వాష్ జోడించబడ్డాయి.