సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో జిల్లా ప్రగతిపథాన ముందుకు సాగుతోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాపాలనలో పారదర్శకత, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని అన్నారు. శనివారం పోలీస్ కమిషనరేట్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ప్రసంగించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉండటంతో ఆరు తడి పంటలను సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతు భరోసాలో భాగంగా 3.25లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.1,476కోట్లను అందజేశామన్నారు. మల్లన్నసాగర్ వరకు అదనపు టీఎంసీ పనులు కొనసాగుతున్నాయన్నారు. గౌరవెల్లి నిర్మాణానికి పర్యావరణ అనుమతులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు హర్షించదగిందన్నారు. 2025–26లో జిల్లాలోని రిజర్వాయర్లలో చేపలు పట్టేందుకు లైసెన్స్‌లు 989 జారీ చేశామని వివరించారు.
జలసిరి పేరుతో..
ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా జలసిరి పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఇంటింటికీ ఇంకుడు గుంత, పంట పంటకూ కుంట, ఊరు ఊరుకు ఊట కుంటల నిర్మాణం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలను బస్సులకు ఓనర్లను చేశామని, ఒక్కో బస్సు ద్వారా మండల సమాఖ్యలకు రూ 70వేలు అద్దెను అందజేస్తున్నామని చెప్పారు.
హ్యామ్ రోడ్లు
రూ.670కోట్ల వ్యయంతో 158 కిలోమీటర్ల మేర 13 రోడ్ల పనులను హ్యామ్ కింద చేపట్టినట్లు తెలిపారు. బీసీ అభివృద్ధి ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.38లక్షల డైట్ చార్జీలు, సెప్టెంబర్ 2026 వరకు రూ.17లక్షల కాస్మోటిక్ చార్జీలను విడుదల చేశామని చెప్పారు. 10,754 ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.255 కోట్లను లబ్ధిదారులకు అందించామన్నారు. యువత కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోందన్నారు.
అభివృద్ధి, సంక్షేమం మరింత చేరువ
పారదర్శకత, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం
పరేడ్ గ్రౌండ్‌లో పంద్రాగస్టు వేడుకలు
చెక్కుల పంపిణీ
మెప్మా ద్వారా 64 పట్టణ మహిళా సంఘాలకు రూ.9.25కోట్ల చెక్కును మంత్రి అందజేశారు. డీఆర్‌డీఏ ద్వారా 821 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రూ.78కోట్ల చెక్కు, తొమ్మిది మంది హార్టికల్చర్, సెరికల్చర్ లబ్ధిదారులకు రూ.8.55 లక్షల చెక్కును అందజేశారు. జిల్లాలోని పలు శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మొత్తం 169 మంది అధికారులు, సిబ్బందిని ప్రశంసా పత్రాలతో అభినందించారు. అంతకు ముందు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పోలీసు, వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ, డీఆర్‌డీఏ, మహిళ శిశు దివ్యాంగుల, వయోవృద్ధ్దుల, చేనేత, డీఎంహెచ్‌ఓ, పురపాలక, లీడ్ బ్యాంకు, ఇతర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్, సీపీతో కలిసి మంత్రి పరిశీలించారు.


