న్యూస్‌రీల్
‘హర్ ఘర్ తిరంగా’.. బీజేపీ నాయకులు గురువారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగాఘనంగా నిర్వహించారు. వివరాలు 8లో u
దుకాణం.. బహుదూరం
● మూడు కిలోమీటర్లకుపైగా నడక యాతన ● కొత్త పంచాయతీలు ఏర్పాటైనా తప్పని తిప్పలు ● వృద్ధులు, ఒంటరి మహిళల పాట్లు
మర్కూక్(గజ్వేల్): రేషన్ బియ్యం తీసుకురావాలంటే కిలో మీటర్లు నడవాల్సిందే.. ఒకటి కాదు రెండు కాదు. మూడు కిలోమీటర్లకుపైగా నడుచుకుంటూ వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఆయా గ్రామాల ప్రజలు ఇప్పటికీ రేషన్ కోసం పాట్లు తప్పడంలేదు. ఇందుకు కొత్తగా రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయకపోవడమే కారణం. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు రేషన్‌కోసం కిలోమీటర్ల దూరం నడక కొనసాగిస్తున్నారు.
రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయకపోవడంతో..
మర్కూక్ మండలంలోని గంగాపూర్– యూసుఫ్‌ఖాన్‌పల్లి, గణేశ్‌పల్లి గ్రామాలు నూతన పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ప్రతి గ్రామంలో 150పై చిలుకు రేషన్ కార్డులు ఉన్నాయి. గంగాపూర్– యూసుఫ్‌ఖాన్‌పల్లిలో 900 వందల మంది జనాభా ఉండగా 190 రేషన్ కార్డులు ఉన్నాయి. అలాగే గణేశ్‌పల్లిలో 150 రేషన్ కార్డులు, 800 మంది జనాభా ఉంది. ప్రభుత్వం నూతనంగా ఈ రెండు గ్రామ పంచాయతీల ఏర్పాటు చేసింది. అయితే ఈ గ్రామాలకు రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయక పోవడంతో పక్క గ్రామాలైన మర్కూక్, చేబర్తికి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నారు.
బయోమెట్రిక్ విధానంతో..
నడవలేని వృద్ధులు, ఒంటరి మహిళల కార్డులను ఇతరులకు ఇస్తే.. సరుకులు తీసుకునే అవకాశం ఉండేది. కానీ బయోమెట్రిక్ విధానం తీసుకురావడంతో రేషన్ పక్కదారి పట్టకుండా కార్డుదా రులే రేషన్ సరుకులకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులు 3 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లడమే సమస్య అయితే.. సరుకులు తీసుకురావడం మరో సమస్యగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు నివేదించాం
ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజను వివరణ కోరగా.. నూతన పంచయతీలలో రేషన్ దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదన్నారు. గణేశ్‌పల్లిలో రేషన్ దుకాణానికి దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆర్‌డీఓకు నివేదించాం. ఉత్తర్వులు రాగానే రేషన్ దుకాణాలు ఏర్పాటు చేస్తాం.


