చేర్యాల(సిద్దిపేట): ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చేర్యాల నకాశీ చిత్రకళను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జానపద కళా సంప్రదాయ నకాశీ మాస్క్‌లు శనివారం సాయంత్రం లోక్‌భవన్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ ఎట్ హోమ్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నకాశీ మాస్క్‌లను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, గవర్నర్ సతీమణి జానకీ శుక్లా ప్రత్యేకంగా పరిశీలించారు. నకాశీ కళలోని కళాత్మకత, ప్రత్యేకతలకు గవర్నర్ ముగ్ధులయ్యారు.
నక్షత్రమాల ధరించిన
మంత్రి పొన్నం
హుస్నాబాద్: భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి వీరభద్రస్వామి 27 రోజుల నక్షత్ర మాలను శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ ధరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో కూడా నక్షత్రమాలను ధరించానని, ఈ ఏడాది కూడా ధరిస్తున్నట్లు తెలిపారు. 27 రోజుల పాటు స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయిరారోగ్యాలతో, సమృద్ధిగా జీవించాలని కోరుకుంటున్నాని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
భారత్ మాతాకి జై..
ఎల్లమ్మ చెరువులో
జాతీయ జెండా రెపరెపలు
హుస్నాబాద్: ఎల్లమ్మ చెరువులో జాతీయ జెండాను ఎగురవేసి భారత్ మాతాకీ జై అంటూ తమ జాతీయ భావాన్ని ప్రదర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలో మార్నింగ్ మానిటరింగ్ డ్యూటీ (ఎంఎండీ) ఆధ్వర్యంలో ఎల్లమ్మ చెరువులో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెరువులో జాతీయ జెండాను ఎగురవేశారు. కొంత కాలంగా ఎంఎండీ సభ్యులు ఎల్లమ్మ చెరువు కట్టపై రోజూ మార్నింగ్ వాకింగ్ చేస్తూ, చెరువులో స్విమ్మింగ్ చేయడం దినచర్యగా కొనసాగిస్తున్నారు.
అందరికీ సమ న్యాయం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సమాజంలోని అందరికీ సమన్యాయం ఉంటుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సంతోష్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంతోష్‌కుమార్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరికీ న్యాయం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. అర్హులైన వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితన న్యాయ సహాయం అందుతుందన్నారు.
కోమటిబండలోసంపూర్ణ మద్య నిషేధం
గజ్వేల్: మండల పరిధి కోమటిబండలో ఇక నుంచి సంపూర్ణ మద్యనిషేధం పాటించాలని స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. శనివారం తీర్మానించారు. సర్పంచ్ తూమ్ అమరేందర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పంచాయతీలో తీర్మానం చేసి ఆమోదించారు. గ్రామంలో మద్యం విక్రయాలు కొనసాగిస్తే రూ.2లక్షల జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నవారి సమాచారం ఇస్తే రూ.5వేల పారితోషికం అందజేయనున్నట్లు కూడా తెలిపారు.


