● దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆశయాలు నెరవేరుస్తా
● సతీమణి సుజాతక్క
దుబ్బాక: నక్సలైట్‌గా.. జర్నలిస్టుగా.. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన రామలింగారెడ్డి తుదిశ్వాస విడిచేంతవరకు పేదల మధ్యలోనే గడిపారని ఆయన ఆశయాల సాధన కోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటానని సోలిపేట సుజాతక్క తెలిపారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 6వ వర్ధంతిని పురస్కరించుకుని దుబ్బాక పట్టణంతో పాటుగా స్వగ్రామం చిట్టాపూర్‌లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా రామలింగారెడ్డి సతీమణి సుజాతక్క మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పెద్దలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తామన్నారు. ఆయన కుమారుడు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ జీవితమంతా పేదల కోసమే పరితపించిన గొప్ప నాయకుడన్నారు. కార్యక్రమంలో నాయకులు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.


