సాక్షి, సిద్దిపేట: పల్లెలు, పట్టణాల్లో నీటి నిల్వ కోసం చాలా మంది సిమెంట్ ట్యాంకులే వినియోగిస్తుంటారు. అయితే ఈ వాటర్ ట్యాంక్‌లలో అధికంగా బ్యాక్టీరియా ఉంటోందని పరిశోధనలో తేలింది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ మెక్రోబయాలజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తిప్పని రేష్మ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆ విభాగ హెడ్ డాక్టర్ మదన్‌మోహన్ మార్గదర్శకత్వంలో ప్లాస్టిక్, సిమెంట్ వాటర్ ట్యాంక్‌లలో నీటి నాణ్యతపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రిసెంట్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్‌లో పబ్లిష్ కోసం అమోదం పొందింది. త్వరలో పబ్లిష్ కానుంది.
పరిశోధన ఇలా..
గతంలో డ్రమ్ములు, గోళాల్లో నీటిని నిల్వ చేసుకునేవారు. ప్రస్తుతం చాలా ఇళ్లల్లో వాటర్ ట్యాంక్‌ల వినియోగం పెరిగిపోయింది. సిద్దిపేట పట్టణంలో 100 ప్లాస్టిక్, సిమెంట్ వాటర్ ట్యాంక్‌లలో నీటి నమూనాలను సేకరించారు. ప్లాస్టిక్, సిమెంట్ ట్యాంకుల నుంచి స్టైరెల్ బాటిళ్లలో నీటి నమూనాలను తీసుకున్నారు. ట్యాంకుల లోపల గోడలపై పేరుకుపోయిన బ్యాక్టీరియాలను గుర్తించేందుకు కాటన్ స్వాబ్ నమూనాలు తీసుకున్నారు. గ్రామ్ స్టెయినింగ్, స్టాండర్డ్ ప్లేట్ కౌంట్, కొలిఫామ్ పరీక్షల ద్వారా సూక్ష్మజీవుల ఉనికిని విశ్లేషించారు. ప్లాస్టిక్ ట్యాంక్ నమూనాలో 50 కాలనీ ఫార్మింగ్ యూనిట్లు (సీఎఫ్‌యూ) మాత్రమే నమోదయ్యాయి. అయితే సిమెంట్ ట్యాంకులో సేకరించిన నమూనాలలో ఒక్కో దానిలో 300 సీఎఫ్‌యూల కంటే ఎక్కువగా లెక్కించలేనంతగా సూక్ష్మజీవులు ఉన్నట్లు పరిశోధనలో నిర్ధారించారు.
నీటి నాణ్యత పై ప్రభావం
సిమెంట్ ట్యాంక్‌ల లోపల ఉపరితలం గరుకుగా ఉండటం, సూక్ష్మ రంధ్రాలు అధికంగా ఉండటంతో బయోఫిల్మ్ ఏర్పడి బ్యాక్టీరియా వేగంగా పెరుగుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ప్లాస్టిక్ ట్యాంకుల ఉపరితలం మృదువుగా ఉండటంతో సూక్ష్మజీవులు అంటుకునే అవకాశం తక్కువగా ఉందన్నారు. సిమెంట్ ట్యాంకుల్లో నిల్వ ఉండే వాటర్‌లో అధికంగా బ్యాక్టీరియా ఉండటంతో నీటి నాణ్యత దెబ్బతినే అవకాశముందని పరిశోధనలో తేల్చారు.
ప్రజలకు సూచనలు..
ఏ వాటర్ ట్యాంక్ అయినా మూడు నుంచి నాలుగు నెలలకు ఒక సారి శుభ్రం చేయాలి. ట్యాంకు మూతలను ఎప్పుడూ బిగుతుగా ఉంచాలని, కాలానుగుణంగా నీటి నాణ్యతను పరీక్షించుకోవాలని పరిశోధకులు సూచించారు. అలాగే వర్షపు నీరు లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సిమెంట్ ట్యాంకులను వినియోగించే వారు నిర్వహణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే నీటి ద్వారా వ్యాపించే అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు.
సిమెంట్ వాటర్ ట్యాంకులతో ముప్పు
ప్రమాదంలో ప్రజారోగ్యం
ట్యాంకులోని నీరంతా కలుషితమే..
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని పరిశోధన
ఆసక్తికర అంశాలు వెలుగులోకి..


